లాక్​డౌన్ ఎఫెక్ట్: వలస కూలీ దుర్మరణం

లాక్​డౌన్ ఎఫెక్ట్: వలస కూలీ దుర్మరణం
  • ఢిల్లీ నుంచి సైకిల్ పై బయల్దేరిన బీహార్ వాసి
  • ఐదురోజుల్లో సగం దూరం చేరిక
  • టిఫిన్ కోసం బ్రేక్​ తీసుకోగా.. కారు ఢీకొట్టడంతో మృతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్​డౌన్ వలస కూలీల పాలిట మృత్యుపాశమవుతోంది. ఉపాధి కోల్పోవడంతో వందలాది మంది కూలీలు కాలి నడకన, సైకిళ్లపై సొంతూళ్లకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ కు చెందిన వలస కూలీ సొంతూరుకు సైకిల్ పై బయల్దేరగా.. మార్గమధ్యంలో కారు ప్రమాదానికి బలయ్యాడు.

బీహార్‌లోని తూర్పు చంపారన్‌కు చెందిన 26 ఏళ్ల సాగీర్ అన్సారీ అనే కూలీ లాక్​డౌన్ ఎఫెక్టుతో ఢిల్లీలో ఉపాధి కోల్పోయాడు. దీంతో ఇంటికి ఎలాగైనా వెళ్లిపోవాలని తన తోటి వలస కార్మికులు ఏడుగురితో కలిసి సైకిల్ మీద ఈ నెల 5 న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరాడు. వీరంతా ఐదురోజుల్లో దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి యూపీలోని లక్నోకు చేరుకున్నారు. ఈ బృందం శనివారం ఉదయం టిఫిన్(వెంట తెచ్చుకునన అటుకులు) తినేందుకు రోడ్ డివైడర్ మీద కూర్చుని ఉండగా.. ఓ కారు కంట్రోల్ తప్పి అన్సారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్సారీకి తీవ్రంగా గాయాలు కాగా.. ఆస్పత్రితో ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయాడు. అక్కడే ఉన్న చెట్టు మమ్మల్ని కాపాడిందని మిగతావారు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారని తెలిపారు.