
ఈ చిత్తడికి ఏం తినాలన్నా, తాగాలన్నా కాస్త ఆలోచించాల్సిందే..! ఎందుకంటే.. వర్షాల కారణంగా ఫుడ్, నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఏది తిన్నా, తాగినా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. సీజన్‌ని బట్టి అలవాట్లు మార్చుకోవాలి. లేదంటే.. అనారోగ్యాలకు ఆహ్వానం పలికినట్లే అంటున్నారు. వర్షాకాలంలో తినే తిండి, తాగే నీరు కలుషితం అవ్వడం కామన్. కానీ, కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. మీ ఆరోగ్యం సేఫ్. అదెలాగంటే..
వానాకాలంలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్లపై తేమ ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. పరాన్నజీవుల సంతానోత్పత్తికి కారణమవుతుంది. అందుకే కూరగాయలను ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీళ్లలో కాసేపు ఉంచి తర్వాత శుభ్రంగా కడగాలి. ఏ రోజు వండిన ఫుడ్ ఆరోజే తినాలి. పదార్థాలపై ఈగలు వంటివి వాలకుండా మూతలు పెట్టాలి. తినే ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
టెంపరేచర్ చెక్ తప్పనిసరి!
ఈ సీజన్లో ఆహారాన్ని సరైన టెంపరేచర్లోనే వండాలి. అలా చేస్తేనే హానికర బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. మాంసం, సీ ఫుడ్ అయితే కనీసం 63 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్లో వండాలి. సరిగ్గా టెంపరేచర్ చూసుకోవాలంటే ఫుడ్ థర్మామీటర్ దొరుకుతుంది.. దాన్ని వాడొచ్చు. కోడిగుడ్లు చాలామంది సరిగా ఉడకకపోయినా అభ్యంతరం లేకుండా తినేస్తుంటారు. కానీ అలా సరిగా ఉడకని గుడ్లు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఈ సీజన్లో పాల ప్రొడక్ట్స్, మాంసాహారం వంటివి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే తక్కువ టెంపరేచర్లో నిల్వ ఉంచాలి. అప్పుడే అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. ఫుడ్‌ని స్టోర్ చేసే చోట తేమ లేకుండా చూసుకోవాలి. పదార్థాలను బట్టి గాలి చొరబడని పాత్రల్లో నిల్వ ఉంచాలి. పాల ప్రొడక్ట్స్ ఏవైనా తాజాగా తినాలి. లేదంటే తినకపోడమే ఉత్తమం. పాలకు బదులు బాదంపాలు, సోయాపాలు వంటివి తీసుకోవచ్చు.
మిగిలిపోతే.. పోనివ్వండి!
మిగిలిపోయిన ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ముఖ్యంగా ఈ సీజన్లో మిగిలి పోయిన ఆహారం జోలికి వెళ్లొద్దు. వేడి చేసుకుని తినడం కొంత పర్వాలేదనిపించినా.. అలా తినడం కూడా హెల్త్‌కి అంత మంచిది కాదు.
బయటి ఫుడ్‌కి బిగ్ నో!
నూనెలో వేయించినవి, మసాలాలు ఉండే ఫుడ్ ఐటెమ్స్ తీసుకోకపోవడమే మంచిది. అవి తింటే జీర్ణసమస్యలు వస్తాయి. అసిడిటీ పెరగొచ్చు. కాబట్టి ఈ కాలంలో మసాలాలు, నూనెలతో చేసే వంటలకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అంతేకాదు.. శుభ్రంగా లేనిచోట స్ట్రీట్ ఫుడ్, నిల్వ ఉన్న మాంసాహారం ఈ సీజన్లో అస్సలు తినకూడదు.
క్లీన్ కిచెన్
కిచెన్ ఎప్పుడూ క్లీన్‌గా ఉండాలి. వండే పదార్థాలే కాదు.. వంటపాత్రలే కాదు.. వండే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి. క్రిములు, బ్యాక్టీరియా దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటకు ఉపయోగించే ప్రతి వస్తువును వేడి నీళ్లు లేదా డిటర్జెంట్ లేదా లిక్విడ్స్‌తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తడి లేకుండా ఆరబెట్టాలి. వంట పాత్రలను వాడే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
తాగునీటితో జాగ్రత్త...!
కాచి చల్లార్చిన నీళ్లు తాగడం ఉత్తమం అని తెలిసిందే. కానీ, ఆ విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటుంటారు కొందరు. అయితే ఈ చిత్తడికి నీరు కలుషితం అయ్యే చాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సురక్షితమైన నీటినే తాగాలి. కాచి చల్లార్చినవో, ఫిల్టర్ చేసిన నీళ్లో తాగాలి. బయటికెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగొద్దు. రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
హెల్దీగా.. హ్యాపీగా..
కలుషిత నీరు, ఆహారం తీసుకుంటే.. అంటువ్యాధులు, డయేరియా, చర్మ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, గజ్జి, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ, మోషన్స్, క్రిప్టోస్పోరిడియోసిస్, బ్లడ్ మోషన్స్ వంటి వాటి బారిన పడతారు. అందుకే ఈ ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. దాంతో హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
ఇంకా..
హెర్బల్ టీలు( కషాయాలు), సూప్‌లు వెచ్చగా తాగాలి. ఇవి జీవక్రియల వేగం పెంచుతాయి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. పెరుగు, మజ్జిగ వంటి ప్రొబయోటిక్స్ కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరం.
సీజనల్‌గా దొరికే ఆపిల్, పియర్, దానిమ్మ, చెర్రీస్, ఆల్బుకర్ వంటివి తినాలి.
వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
తేలికపాటి ప్రొటీన్ ఫుడ్స్, తృణధాన్యాలు వంటివి తినడం బెటర్. అవి ఈ కాలంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించడమే గాక ఈజీగా డైజెస్ట్ అవుతాయి.