వేల లీటర్ల పాలు సేకరించి, లక్షల లీటర్ల తయారీ

వేల లీటర్ల పాలు సేకరించి, లక్షల లీటర్ల తయారీ
  • ఫ్యాట్‍ తీసి.. పాల పౌడర్, నీళ్లతో కల్తీ
  • 60 నుంచి 70 శాతం కల్తీ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలు
  • జిల్లా డెయిరీలపై హైదరాబాద్‍ టాస్క్​ఫోర్స్ వరుస దాడులు
  • నోటిసులతోనే సరిపుచ్చుతున్నారనే ఆరోపణలు

వరంగల్​ / హనుమకొండ, వెలుగు: గ్రామాల్లోని రైతుల నుంచి నిత్యం వేలాది లీటర్ల పాలు సేకరిస్తున్న డెయిరీలు.. బయటకు మాత్రం లక్షల లీటర్ల పాలను పంపుతున్నాయి. పెరుగు, బట్టర్‍ వంటి బై ప్రొడక్ట్స్​ కోసం పాలలోని ఫ్యాట్‍ ను తీసేస్తున్నారు. రుచి, చిక్కదనం కోసం పాల పొడి, కెమికల్స్ కలుపుతున్నారు. ఇవి నాణ్యమైన పాలంటూ కవర్ల మీద ప్రింట్ చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఆవు పాలు అని ముద్రించి.. కస్టమర్లకు బర్రె పాలు అంటగడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న వరుస దాడులు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

నీళ్లు, గ్లూకోజ్‍ పౌడర్‍..
ఉమ్మడి వరంగల్​లో ఓ డెయిరీలో నిత్యం 30 నుంచి 40 వేల లీటర్లు రైతుల నుంచి పాల సేకరణ జరుగుతుంటే.. లక్ష లీటర్ల కంటే ఎక్కువగా పాలు ప్యాకెట్ల రూపంలో బయటకు వెళ్తున్నాయి. పాలలో కొవ్వు తీసి నీళ్లు, గ్లూకోజ్‍ పౌడర్‍, ఇతరత్రా పౌడర్లు కలుపుతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్‍ నుంచి టాస్క్​ఫోర్స్ టీంలు రంగంలోకి దిగాయి. మూడు, నాలుగు రోజులుగా హనుమకొండ జిల్లా పరిధిలోని పలు డెయిరీ ఫారాలపై దాడులు చేశాయి. అక్కడ వారికి పెద్ద ఎత్తున కెమికల్స్, నీళ్లు లభించాయి. ఆఫీసర్లు వాటికి సంబంధించిన నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‍ ల్యాబ్​కు పంపారు.

స్టోరీజీ కోసం కెమికల్స్ మిక్సింగ్..
స్వచ్ఛమైన పాలు 5 నుంచి 6 గంటలు మాత్రమే నిల్వ ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు. వీటిని డెయిరీలో ఫిల్టర్ చేస్తే 24 గంటల పాటు నిల్వ ఉంటాయి. అయితే మరిన్ని రోజులు నిల్వ ఉండాలని, పలువురు డెయిరీ యజమానులు అందులో కెమికల్స్ కలుపుతున్నారు. చాలాచోట్ల హైడ్రోజన్‍ పెరాక్సైడ్‍, సోడా, యూరియా బస్తాలు దొరకడం దీనికి బలం చేకూరుస్తోంది.

జిల్లా డెయిరీలపై టాస్క్​ఫోర్స్ దాడులు  
ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు డెయిరీల్లో పాల కల్తీ జరుగుతోందనే సమాచారంతో ఈ నెల 3న హైదరాబాద్‍ నుంచి టాస్క్​ఫోర్స్, ఫుడ్‍ సేఫ్టీ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. హనుమకొండ జిల్లా గూడెప్పాడ్‍ మార్గంలో ఉండే ఎన్‍ఎస్‍ఆర్‍ డెయిరీతో పాటు కమలాపూర్‍లోని ఓ కేంద్రంపై వరుస దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆఫీసర్లు మాట్లాడుతూ.. తమ దాడుల్లో పలుచోట్ల గడువు ముగిసిన పాల ఉత్పత్తులు, కెమికల్స్ లభించాయని చెప్పారు. శాంపిల్స్​లో క్వాలిటీ ప్రమాణాలు తక్కువగా ఉన్నాయన్నారు. డెయిరీ లైసెన్స్​ను వారం పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. టెస్టుల కోసం పంపిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. కాగా, దాడుల పేరుతో నానా హడావుడి చేస్తున్న ఫుడ్‍ సేఫ్టీ ఆఫీసర్లు.. కేసులు నమోదు చేయకుండా రిపోర్టుల రూపంలో సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

కల్తీ నిజమే
డెయిరీ ఫారాల్లో పాల సేకరణ కంటే బయటకొచ్చే పాలు ఎక్కువగా ఉంటున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీనికితోడు ఎక్కువ శాతం కెమికల్స్‍ వాడుతున్నారు. ఫ్యాట్‍ తీసి నీళ్లు, పౌడర్లు కలుపుతున్నట్లు తెలుస్తోంది. చాలాచోట్ల ప్యాకెట్‍పై ముద్రించే వివరాలు ప్రొడక్ట్ లో మెయింటైన్‍ చేయడం లేదు. ఆవు పాలు పేరు చెప్పి బర్రె పాలు మిక్స్ చేసేవారు కూడా ఉంటున్నారు. డెయిరీ కేంద్రాల్లో అవసరంలేని కెమికల్స్ కనిపిస్తున్నాయి. కాగా, వాటిని పాలల్లో కలిపారా లేదా అనేది హైదరాబాద్‍లో నిర్వహించే ల్యాబ్‍ టెస్టుల్లో తేలాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పాలల్లో కల్తీ జరుగుతుందనే సమాచారం ఆధారంగా ఉమ్మడి వరంగల్​లో రైడ్స్‍ చేస్తున్నాం. రిపోర్టుల ఆధారంగా చర్యలుంటయ్‍. - అమృతశ్రీ, జోనల్‍ అసిస్టెంట్‍ ఫుడ్‍ కంట్రోలర్‍