అర్జెంటీనాలోని సెంట్రల్ బ్యూనోస్ ఎయిర్స్ వద్ద మెస్సీ ఫ్యాన్స్ సందడి

అర్జెంటీనాలోని సెంట్రల్ బ్యూనోస్ ఎయిర్స్ వద్ద మెస్సీ ఫ్యాన్స్ సందడి

ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠగా సాగిన తన ఆట పదునుతో ఈ పోటీలో అర్జెంటీనా ట్రోఫీ విన్నర్ గా లియోనాల్ మెస్సీ నిలిచారు. దీంతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఆ దేశంలోనూ అంబరాన్నంటేలా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనాలో అత్యంత ప్రసిద్ధి గాంచిన సెంట్రల్ బ్యూనోస్ ఎయిర్స్ లోని ఒబెలిస్క్ వద్దకు భారీ సంఖ్యలో ఫుట్ బాల్ ఫ్యాన్స్, ప్రజలు వచ్చి చేరారు. పటాసులు పేలుస్తూ, డ్యాన్సులు చేశారు.

సుమారు 20 లక్షల మందికి పైగా జనం ఒక చోట చేరి.. ఆ దేశ జెండాను రెపరెపలాడిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విజయంతో తాము చాలా సంతోషంగా ఉన్నామని అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపుతో తమ కష్టాలను కొన్ని రోజులైనా మర్చిపోయి బతుకుతామని అంటున్నారు. దేశంలోని 4.5 కోట్ల ప్రజల్లో 40 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నవారే. అయితే ఆర్థికంగా దేశం ఎన్నో కష్టాలను చూస్తోందని, నెలాఖర్లో అవసరాలు తీరడం కష్టంగా ఉంటుందని ఓ నిర్మాణ రంగ కార్మికుడు పేర్కొనడం గమనార్హం. కానీ, తాము బాధపడిన ప్రతిదానికీ ఈ విజయం ప్రతిఫలాన్నిచ్చిందన్న ఆనందం వ్యక్తం చేశాడు.