కోట్లాది మంది ఉద్యోగాలకు ఎసరు.. రాబోయే రోజుల్లో పెరగనున్న ప్రభావం

కోట్లాది మంది ఉద్యోగాలకు ఎసరు.. రాబోయే రోజుల్లో పెరగనున్న ప్రభావం
  • హీట్​ వేవ్​ ప్రభావం ప్రపంచంలో కెల్లా మనదేశంపైనే ఎక్కువ
  • ఫార్మా రంగంలో ఇప్పటికే నష్టాలు
  • వరల్డ్ బ్యాంక్​ క్లైమేట్ రిపోర్టులో వెల్లడి

తిరువనంతపురం: హీట్​వేవ్స్.. రానున్న రోజుల్లో మన దేశంలో ప్రమాదకరంగా మారతాయని, మనం తట్టుకోలేనంతగా టెంపరేచర్​ పెరిగిపోతుందని వరల్డ్​ బ్యాంక్ రెడీ చేసిన తాజా క్లైమేట్​ రిపోర్ట్ ​వెల్లడించింది. ఇప్పటికే మన దేశంలో హీట్​ వేవ్స్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కొన్నేండ్లుగా హీట్​వేవ్స్ తీవ్రత పెరుగుతోందని వివరించింది. ప్రపంచ దేశాలలో మనదేశమే వీటి ప్రభావానికి ఎక్కువగా లోనవుతోందని తెలిపింది. ఇలాగే కొనసాగితే మనుషుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఈ రిపోర్టులో ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘క్లైమేట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఆపర్చ్యునిటీస్ ఇన్ ఇండియా కూలింగ్​సెక్టార్” పేరుతో వరల్డ్​ బ్యాంక్​ రిపోర్టు తయారు చేసింది. కేరళ గవర్నమెంట్ తో కలిసి నిర్వహిస్తున్న ‘‘ఇండియా క్లైమేట్ అండ్ డెవలప్‌‌మెంట్ పార్టనర్స్ మీట్’’లో ఈ రిపోర్టును అధికారికంగా రిలీజ్​ చేస్తుంది. హీట్​వేవ్స్ ఎఫెక్ట్​ మనదేశంపై రాబోయే కొన్నేండ్ల పాటు ఉంటుందని చెప్పింది. 

కర్బన ఉద్గారాలు పెరిగితే..

ఇండియాలో కర్బన ఉద్గారాలు పెరిగితే.. 2036–65 నాటికి ఇప్పటితో పోలిస్తే.. హీట్​వేవ్స్​ 25 రెట్లు పెరుగుతాయని వరల్డ్​బ్యాంక్ తన రిపోర్ట్​లో హెచ్చరించింది. ఫలితంగా ఇండియా ఫైనాన్షియల్​గా దెబ్బతింటుందని తెలిపింది. దేశంలో 75% మంది (38కోట్లు) కార్మికులున్నారని, వీరంతా ఎండలోనే పనిచేస్తారని చెప్పింది. 2030 నాటికి హీట్, ప్రెషర్ కారణంగా ప్రొడక్టవిటీ తగ్గుతుందని, దీంతో 3.4కోట్ల మంది ఉద్యోగాలు పోతాయని తెలిపింది. వరల్డ్​వైడ్​గా చూసుకుంటే 8కోట్ల మంది జాబ్​ కోల్పోతారని అంచనా వేస్తున్నట్టు చెప్పింది. దక్షిణాసియాలోని దేశాల్లో ఇండియాపై ఇప్పటికే ఈ ఎఫెక్ట్​ కనిపిస్తున్నదని, కార్మిక రంగంలో ఏడాదికి 101 బిలియన్ గంటలకుపైగా నష్టపోతున్నట్లు పేర్కొంది. ఇండియాలో ఫుడ్, పబ్లిక్ హెల్త్ సెక్యూరిటీ.. కోల్డ్ చైన్ నెట్‌‌వర్క్‌‌పై ఆధారపడతాయని గ్లోబల్ మేనేజ్​మెంట్​ కన్సల్టింగ్ కంపెనీ ‘మెక్​కిన్సే అండ్​ కంపెనీ’ తెలిపింది. కోల్డ్​ చైన్ నెట్​వర్క్ బ్రేక్ అయితే వ్యాక్సిన్స్, ప్రొడక్ట్స్ దెబ్బతింటాయని చెప్పింది. 4శాతం ప్రొడక్ట్స్​కు మాత్రమే కోల్డ్​చైన్ ఫెసిలిటీ ఉందని, ఏడాదికి లక్షకోట్ల విలువైన ఫుడ్​లాస్ అవుతుందని తెలిపింది.

ఏడాదిలో రూ.28వేలకోట్ల నష్టం

కరోనాకు ముందు ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్​ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్​గా ఇండియా ఉంది. టెంపరేచర్ సెన్సిటివ్ మెడికల్ ప్రొడక్ట్స్‌‌లో 20%, వ్యాక్సిన్లలో 25% దాకా నష్టపోయింది. కోల్డ్ చైన్స్ బ్రేక్​కావడంతో ఏడాదికి 28వేల కోట్లు కోల్పోయిందని మేక్​ కిన్స్ అండ్ కంపెనీ తెలిపింది. హీట్​ పెరగనుండటంతో కూలింగ్​కు డిమాండ్​ పెరుగుతుందని కూలింగ్ యాక్షన్ ప్లాన్ నివేదిక చెబుతున్నది. ఇండియాలో మూడింట రెండొంతుల మంది రోజుకు రూ.160 కన్నా తక్కువ ఇన్​కంతోనే బతుకుతారు. ఏసీ ధర దాదాపు రూ.21వేల నుంచి రూ.41వేల మధ్యలో ఉంటుంది. అప్పుడు ఏసీలు 
లగ్జరీ వస్తువు కింద వస్తుందని, దీంతో కొద్దిమందికే ఇవి అందుబాటులో ఉంటాయని యాక్షన్​ ప్లాన్ నివేదిక చెప్పింది.

ఇప్పటికే హెచ్చరించిన సైంటిస్టులు

2022 ఏప్రిల్​లోనే ఎండ తీవ్రత ఎక్కువ రికార్డయ్యిందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఆ టైంలో ఢిల్లీలో 46 డిగ్రీలుగా నమోదైందని గుర్తుచేసింది. మార్చి నాటికి టెంపరేచర్ రికార్డు స్థాయికి చేరిందని వివరించింది. ఇండియాలో మనిషి జీవితంపై హీట్​వేవ్స్ చాలా ప్రభావం చూపుతాయని వరల్డ్ బ్యాంక్​ చెప్పింది. దక్షిణాసియా అంతటా ఏటా రికార్డు స్థాయిలో టెంపరేచర్​ నమోదవుతోందని, క్లైమేట్ సైంటిస్టులు ఇప్పటికే హెచ్చరించారని గుర్తుచేసింది. ఇటీవల అక్కడి దేశాల్లో హీట్​వేవ్స్ తీవ్రత పెరగడమే దీనికి నిదర్శనమని తెలిపింది. 2021 ఆగస్టులోనే.. ఇండియా సబ్ కాంటినెంటల్​లో మరో పదేళ్లలో హీట్​వేవ్స్​తో పాటు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ఇంటర్ గవర్నమెంటల్​ ప్యానెల్​ఆన్​ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ఆరో అసెస్​మెంట్ రిపోర్టు హెచ్చరించిందని వరల్డ్ బ్యాంక్ గుర్తుచేసింది. అదే ఏడాది జీ20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ కూడా ఇండియాను హెచ్చరించింది.