30 సీట్లలో మజ్లిస్ పోటీ!.. ఎక్కడెక్కడంటే?

30 సీట్లలో  మజ్లిస్ పోటీ!..  ఎక్కడెక్కడంటే?
 
  • 15 స్థానాల్లో గెలవాలని టార్గెట్ 
  • మైనార్టీలు ఎక్కువుండే చోట్ల బరిలోకి..  
  • ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​తో స్నేహపూర్వక పోటీ  
  • మైనార్టీల ఓట్లు కాంగ్రెస్​కు టర్న్ కాకుండా ప్లాన్

హైదరాబాద్‌‌, వెలుగు:  ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం (మజ్లిస్).. మన రాష్ట్రంలో మాత్రం పాతబస్తీకే పరిమతమవుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 30 సీట్లలో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో 15 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మజ్లిస్ పార్టీ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. వచ్చేసారి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ తమను దూరం పెట్టడాన్ని మజ్లిస్ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. బీఆర్ఎస్ తో స్నేహపూర్వక పోటీకి రెడీ అయిన మజ్లిస్.. మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కు టర్న్ కాకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

కాంగ్రెస్ ను అడ్డుకోవడమే లక్ష్యమా? 

మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కు మళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా మజ్లిస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ మధ్య దాదాపు 30 నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని పదవికి కేసీఆరే సరైన వ్యక్తి అని అసదుద్దీన్ గతంలో అన్నారు. మజ్లిస్ తో స్నేహం కొనసాగుతుందని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల ప్రకటన సమయంలో తెలిపారు. అయితే బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై, ఎంఐఎంతో తమ స్నేహం కొనసాగుతుందన్న కేసీఆర్ ప్రకటనపై మజ్లిస్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రెండు పార్టీలకు ప్రయోజనం చేకూరేలా, ఓట్లు చీలకుండా మజ్లిస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. గెలిచే అవకాశం ఉన్న చోట ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.

కింగ్ మేకర్ కావాలని ప్లాన్.. 

పాతబస్తీలోని 7 నియోజకవర్గాలు మజ్లిస్ కు కంచుకోట. ప్రతి ఎన్నికలో చార్మినార్, యాకుత్ పురా, మలక్ పేట, బహదూర్ పురా, కార్వాన్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఈ సీట్లలో గెలుస్తూ వస్తోంది. అయితే ఈసారి తమ బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన పార్టీగా మారాలని, కింగ్‌‌ మేకర్‌‌ గా ఎదగాలని భావిస్తోంది. కేవలం ఓల్డ్‌‌ సిటీకే పరిమితం కాకుండా, పార్టీని విస్తరించి రాజకీయంగా మరింత ప్రయోజనం పొందాలని చూస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీని విస్తరిస్తామని, మరిన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతోంది. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలోని రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ తో పాటు బోధన్, నిజామాబాద్ లాంటి చోట్ల అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. 

అసెంబ్లీ బరిలో అసదుద్దీన్? 

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరగనున్న నేపథ్యంలో కొందరు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు అసెంబ్లీ బరిలో నిలవాలని చూస్తున్నారు. మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. ఆయన ఇటీవల చేసిన ప్రకటనలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు అక్బరుద్దీన్‌‌ ఒవైసీ కొడుకు నూరుద్దీన్‌‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. దీంతో అసదుద్దీన్, నూరుద్దీన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు సిట్టింగ్‌‌లకు టికెట్లు దక్కకపోవచ్చని తెలుస్తోంది.

ఎక్కడెక్కడ పోటీ అంటే?  

పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని మజ్లిస్ భావిస్తోంది. 20 నుంచి 25 శాతం మైనారిటీ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టి, ఆయా చోట్ల పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో టాక్‌‌ వినిపిస్తోంది. పాతబస్తీలోని 7 స్థానాలతో పాటు మహబూబ్‌‌నగర్, గద్వాల, రాజేంద్రనగర్, గోషామహల్, ముషీరాబాద్, అంబర్ పేట, నిజామాబాద్ అర్బన్, బోధన్, ముధోల్, ఆదిలాబాద్, వరంగల్ తూర్పు, నిర్మల్, బాన్సువాడ, కరీంనగర్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, తాండూరు, కొడంగల్ తదితర నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ ఉండే విధంగా కేసీఆర్ తో చర్చలు జరపాలని నిర్ణయించినట్టు సమాచారం.