వరంగల్-- కరీంనగర్ రోడ్డు మేడారం జాతర కల్లా పూర్తయ్యేనా?.. హైవేపై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు

 వరంగల్-- కరీంనగర్ రోడ్డు  మేడారం జాతర కల్లా పూర్తయ్యేనా?.. హైవేపై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు
  • నెమ్మదించిన ఫోర్ లైన్ విస్తరణ పనులు
  • సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిల వద్ద చాలావరకు పెండింగ్
  • రెండున్నర నెలల్లో ప్రారంభం కానున్న మేడారం మహాజాతర
  • ఉమ్మడి మెదక్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ కు ఈ రోడ్డే కీలకం

హనుమకొండ, వెలుగు: వరంగల్-కరీంనగర్ హైవే (ఎన్​హెచ్​-563) ఫోర్ లైన్ రోడ్డు పనులకు బ్రేకులు పడ్డాయి. నిత్యం వేలాది వెహికల్స్ రాకపోకలు సాగించే ఈ రోడ్డు పనులు మొదట్లో జోరుగా సాగినా ఇప్పుడు స్పీడ్ తగ్గడంతో వర్క్స్ స్టార్ట్ అయి రెండేండ్లు దాటినా ఇంతవరకు పూర్తికాలేదు. ఫోర్ లైన్ కన్ స్ట్రక్షన్ పనుల వల్ల చాలాచోట్ల పాత రోడ్డు ఇరుకుగా మారగా, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే మేడారం జాతర ప్రారంభం కానుంది.

 ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలోని కొన్నిప్రాంతాల నుంచి లక్షలాది వెహికల్స్​ ఈ రోడ్డు గుండానే హనుమకొండ మీదుగా సమ్మక్క జాతరకు వెళ్తుంటాయి. జాతర లోగా పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే వాహనదారులు ఇబ్బందులు పడటంతోపాటు యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఎన్​హెచ్-563 పెండింగ్ వర్క్స్ సకాలంలో పూర్తి చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్లానింగ్ లోపాలతో ఇబ్బందులు..

నేషనల్ హైవే-563లోని వరంగల్-కరీంనగర్ రోడ్డును భారత్ మాల పరియోజన కింద ఫోర్ లైన్ గా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,147 కోట్లు మంజూరు చేసింది. ప్రధాని మోదీ 2023 జులై 8న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 68 కిలోమీటర్ల ఈ రోడ్డులో హనుమకొండ జిల్లా పరిధిలో 21.77 కి.మీలు, కరీంనగర్ జిల్లా పరిధిలో 48.86 కి.మీలు ఉన్నాయి. దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ అనే సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకోగా, 2023 జులైలోనే పనులు స్టార్ట్ చేశారు. మొదట్లో పనులు స్పీడ్ గానే జరిగినా ప్రణాళికా లోపాల కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆఫీసర్లు చాలా ఊర్ల వద్ద అండర్ పాస్ లు ప్లాన్ చేయలేదు. 

ఫలితంగా హనుమకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్, కోతులనడుమతోపాటు మరికొన్ని గ్రామాల ప్రజలు అండర్ పాస్ ల కోసం ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆఫీసర్లు పనుల్లో మార్పులు, చేర్పులు చేశారు. ఫలితంగా రోడ్డు నిర్మాణ వ్యయం మరో రూ.70 కోట్ల వరకు పెరగగా, పనులు కూడా ఆలస్యమవుతూ వచ్చాయి. ఇప్పటికీ బావుపేట వద్ద సరైన అండర్ పాస్ బ్రిడ్జి లేకపోవడం వల్ల బావుపేట మీదుగా కమలాపూర్ వైపు వెళ్లాల్సిన వెహికల్స్ రెండు కిలోమీటర్ల దూరంలోని అనంతసాగర్ ఎస్సార్ ఎస్పీ బ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జాతరకు ముందే మేల్కోపోతే ముప్పే..

వరంగల్-కరీంనగర్ హైవే ఫోర్ లైన్ విస్తరణ పనులు 2025–-26 ఆర్థిక సంవత్సరం నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు 78.2 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్లు, సర్వీస్ రోడ్లు, పెండింగ్ పనులు పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. కానీ, వచ్చే జనవరి 28 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఆ సమయంలో మెదక్, సిద్దిపేట, హుస్నాబాద్ వైపు ఉన్న ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని మరికొన్ని ఏరియాల నుంచి వచ్చే వెహికల్స్ మేడారం వెళ్లేందుకు ఈ రోడ్డే దిక్కు. ఆ బండ్లన్నీ ఎల్కతుర్తి నుంచి హనుమకొండ మీదుగా మేడారం వైపు వెళ్లాల్సి ఉండగా, జాతర జరిగినన్నీ రోజులు ఈ రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోతుంది. 

ఆలోగా పనులు పూర్తి చేయకపోతే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు, చాలాచోట్ల యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, మేడారం జాతరకు ముందే రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. 

నత్తనడకన బ్రిడ్జిల పనులు..

ఎన్ హెచ్-563 ఫోర్ లైన్ నిర్మాణంలో భాగంగా 9 మేజర్ బ్రిడ్జిలు, 20 మైనర్ బ్రిడ్జిలు, 189 కల్వర్టులు, 22 మేజర్ జంక్షన్లు, 29 మైనర్ జంక్షన్లు నిర్మించాల్సి ఉంది. 27.7 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా 7.2 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకసాగుతున్నాయి. ఈ రోడ్డు 30 గ్రామాల మీదుగా వెళ్తుండగా, హసన్ పర్తి, ఎల్కతుర్తి, హుజురాబాద్, తాడికల్, మానకొండూరు వద్ద సుమారుగా 45.3 కిలోమీటర్లకుపైగా బైపాస్ గానే నిర్మిస్తున్నారు.

 పాత రోడ్డు 22.7 కిలోమీటర్ల మేర ఉండగా, ఇప్పుడు రాకపోకలన్నీ ఈ రోడ్డు మీదుగానే సాగుతున్నాయి. ఓ వైపు ఫోర్ లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటం, మరోవైపు గతంలో ఉన్న పాతరోడ్డు దెబ్బతినడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి.