- మూడు రోజుల మణిపూర్ పర్యటనలో కేంద్ర మంత్రి
 
న్యూఢిల్లీ, వెలుగు: మణిపూర్ సమగ్రాభివృద్ధి కోసం వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా విద్య, వైద్యం, రవాణా, టూరిజం, విద్యుత్, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మూడు రోజుల మణిపూర్ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ చేరుకున్నారు.
ఆ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై సెక్రటేరియెట్లో సమీక్షించారు. మణిపూర్ అభివృద్ధి, సంక్షేమమే కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర రాజధాని ఇంపాల్ ఎయిర్ పోర్టును ఆధునికీకరించి, కార్గో సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంజయ్కు అధికారులు విజ్ఞప్తి చేశారు, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలని ఆసుపత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉందని.. దాన్ని తీర్చాలని కోరారు. కొండ ప్రాంతాల్లో విద్యార్థుల డ్రాపవుట్స్ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు.
గవర్నర్ అజయ్ భల్లాతో భేటీ
సెక్రటేరియట్ లో సమీక్ష అనంతరం బండి సంజయ్ నేరుగా మణిపూర్ రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ అజయ్ భల్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
