కేసీఆర్ లెక్క దొంగ హామీలు ఇవ్వను : బండి సంజయ్

కేసీఆర్ లెక్క దొంగ హామీలు ఇవ్వను : బండి సంజయ్
  • ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా పనిచేస్తా

జమ్మికుంట, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతోనే తనకు పదవి వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. తొలుత ఆయనకు పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా పనిచేస్తానని చెప్పారు. ఇల్లందకుంట దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ లెక్క దొంగ హామీలిచ్చి మోసం చేసే అలవాటు తనకు లేదన్నారు. మరోవైపు, నాగర్ కర్నూల్ జిల్లాలో నిరుపేద చెంచు మహిళపై జరిగిన దాష్టికంపై బండి సంజయ్ స్పందించారు. ఇది నిర్భయ కంటే దారుణమైన ఘటనని,  ఇటువంటి గూండాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అడ్డగోలు  దందాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

శంకరపట్నం:  మండలంలోని తాడికల్​లో నూతనంగా నిర్మించిన సహకార సంఘ భవనాన్ని  బండి సంజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయనను పాలకవర్గ సభ్యులను సన్మానించారు. అనంతరం కొత్తగట్టు మత్స్య గిరింద్ర స్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు.