ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం..ఎన్ఎంఎన్ఎఫ్ కింద జగిత్యాల జిల్లాలో 2500 ఎకరాలు గుర్తింపు

ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం..ఎన్ఎంఎన్ఎఫ్ కింద జగిత్యాల జిల్లాలో 2500 ఎకరాలు గుర్తింపు
  • 20 క్లస్టర్లలో 125 మంది మహిళా రైతులను ఎంపిక చేసి ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ 
  • పెట్టుబడి భారం తగ్గించి, నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యం

జగిత్యాల, వెలుగు:  రైతుల రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి సేద్యం వైపు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్(ఎన్‌‌‌‌‌‌‌‌ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌) పథకం ద్వారా జగిత్యాల జిల్లాలో తొలి విడతగా 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

 ఈక్రమంలో క్షేత్రస్థాయిలో రైతులకు సేంద్రీయ సాగుపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడుల తగ్గింపు, నాణ్యమైన దిగుబడులు సాధించడంపై దృష్టి పెట్టున్నారు. ఇందుకు జిల్లాలో 20 క్లస్టర్లకు ఒక్కో మహిళా రైతును ‘కృషి సఖిగా’ ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. 

ఒక్కో క్లస్టర్‌‌‌‌‌‌‌‌లో సుమారుగా 125 ఎకరాలు

జిల్లాలో ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు క్లస్టర్ల చొప్పున మొత్తం 20 క్లస్టర్లను గుర్తించారు. ఒక్కో క్లస్టర్‌‌‌‌‌‌‌‌కు 125 ఎకరాల భూమిని ఎంపిక చేసి, మొత్తం 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. ఇందుకు సంబంధించిన రైతుల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు భూసారం పెరుగుతుందని, పంటలు నాణ్యతగా ఉండటం వల్ల లాభాలు వస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో గాలి, నీరు, నేల కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని వివరిస్తున్నారు. 

వానాకాలంలో చిరుధాన్యాల సాగు

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని మహిళా సంఘాల నుంచి 125 మంది మహిళా రైతులను కృషి సఖిలుగా వ్యవసాయ శాఖ నియమించింది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా బీజామృతం, జీవామృతం, ఆచ్చాదన వంటి పద్ధతులతో పంటల సాగుపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణను ‘జన్ వికాస్’ అనే ఎన్‌‌‌‌‌‌‌‌జీవో ద్వారా నిర్వహిస్తున్నారు. 

మేడిపల్లి మండలంలోని రైతు వేదికలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు తొలి విడత శిక్షణ శిబిరం నిర్వహించగా, తదుపరి విడతల్లో కూడా శిక్షణ శిబిరాలు కొనసాగనున్నాయి. శిక్షణ పూర్తయ్యాక కృషి సఖిలు రైతుల పొలాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. వచ్చే వానాకాలంలో పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో చిరుధాన్యాల సాగు చేపట్టడమే వ్యవసాయ శాఖ లక్ష్యంగా పని చేస్తోంది.

20 క్లస్టర్లను గుర్తించి శిక్షణ

జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే 20 క్లస్టర్లను గుర్తించాం. ఈ క్లస్టర్ల పరిధిలో మొత్తం 2,500 ఎకరాల్లో ప్రకృతి సేద్య పద్ధతుల్లో పంటలు సాగయ్యేలా చర్యలు చేపట్టాం. ఇప్పటికే కృషి సఖిలను నియమించి రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం. పెట్టుబడి తగ్గించి, నాణ్యమైన పంటలు పండించే దిశగా రైతులను ప్రోత్సహిస్తాం. -సంకె శ్రీనివాస్, ఎన్ఎంఎన్ఎఫ్​ జిల్లా నోడల్ అధికారి, జగిత్యాల.