
పుల్కల్, వెలుగు: మహిళలు స్వయం శక్తితో ఎదగాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం చౌటకూర్ మండలంలోని తడ్దాన్ పల్లి చౌరస్తా సమీపంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇందిరా శక్తి విజయోత్సవ సంబరాలకు కూతురు త్రిషతో కలిసి హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహాలక్ష్మి పథకం ద్వార ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం రూ.6680 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో రూ.972 కోట్ల డ్వాక్రా రుణాలు అందించామని తెలిపారు. రూ.5లక్షల స్కూల్ యూనిఫామ్స్ డ్వాక్రా మహిళలతో తయారు చేయించి స్టూడెంట్స్ కు అందించామన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో ప్రతి మండలానికి అధునిక సౌకర్యాలతో సమైక్యభవనాల మంజూరు చేస్తామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు అందించిన ఘనత నాడు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అధికారులు చంద్రశేఖర్, జ్యోతి, పాండు, ఏపీవో శివలక్ష్మి, కాంగ్రెస్ మండలాధ్యక్షడు దశరత్ పాల్గొన్నారు.