ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నోళ్లంతా బయటికి వస్తరు : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నోళ్లంతా బయటికి వస్తరు :   దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ బయటికి వస్తారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ బేగంపేటలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకే కేసీఆర్ పొలంబాట పట్టారని అన్నారు. రైతుల విషయం మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా  ఓపెన్ చేయలేదని చెబుతున్న కేసీఆర్ ఆయన హయాంలో తరుగు పేరిట రైతులను నిండా మోసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిందని, నీరు తక్కువగా మిషన్ భగీరథ పైపులకూ నీళ్లందవన్నారు. 45 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మిషన్ భగీరథ పథకం ఉపయోగ పడటం లేదని అన్నారు.

 తాము ఎవరం ఢిల్లీ వెళ్లినా కప్పం కట్టేందుకు వెళ్లారని ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ వాళ్లు ఎన్నోసార్లు వెళ్లారు.. వాళ్లు కేంద్రానికి కప్పం కట్టారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు కప్పం కడతారు కాబట్టి అందరూ కడతారనుకుంటే అది వాళ్ల వివేకానికే వదిలేస్తామని చెప్పారు.