ఎన్టీఆర్​, కేసీఆరే మంచి సీఎంలు .. మిగిలినోళ్లు బ్రోకర్లు : ఎర్రబెల్లి

ఎన్టీఆర్​, కేసీఆరే మంచి సీఎంలు ..   మిగిలినోళ్లు బ్రోకర్లు : ఎర్రబెల్లి

ములుగు, వెలుగు:  అప్పట్లో ఎన్టీ రామారావు, ఇప్పుడు కేసీఆర్​ మాత్రమే మంచి సీఎంలని, మిగిలినోళ్లు బ్రోకర్లని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. తన 40ఏండ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని, ఎన్టీఆర్​, కేసీఆర్​లాంటి మంచి సీఎంలు  మరెవరూ లేరని చెప్పారు. ఎన్టీఆర్​ పేదల కోసం పనిచేశారని, కేసీఆర్​ కూడా పేదల కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గురువారం ములుగులో మెడికల్​ కాలేజీ శంకుస్థాపన తర్వాత జరిగిన సభలో ఎర్రబెల్లి మాట్లాడారు. 

‘‘60 ఏండ్ల కాంగ్రెస్​ పాలనలో జరగని పనులన్నీ పదేండ్లలోనే  అవుతాయా..  కొంత ఓపిక పట్టాలి” అని చెప్పారు. గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని కేసీఆర్​ ఆలోచించారని,  గతంలో కాంగ్రెస్​ చేసిన చట్టం వల్లనే పట్టాల పంపిణీ  ఆలస్యమైందని అన్నారు. గిరిజనేతరులకు కూడా పట్టాల పంపిణీకి కృషిచేస్తామని ఆయన తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేసీఆర్​ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తున్నదని అన్నారు. 

కాగా.. గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో వివక్ష కనిపిస్తున్నదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించగా .. గతంలో మాదిరిగానే సీతక్క  ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగుతుందని మంత్రి సత్యవతి హామీ ఇచ్చారు.