నేను ప్లేట్​ పట్టుకున్నాకే మీకు బుక్క: ఎర్రబెల్లి

నేను ప్లేట్​ పట్టుకున్నాకే మీకు బుక్క: ఎర్రబెల్లి
  •    ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలోమంత్రి ఎర్రబెల్లి
  •     ఆలస్యంగా వచ్చిన మినిస్టర్​.. జనాలకు అన్నం పెట్టకుండా ప్రోగ్రామ్ కంటిన్యూ!

​యాదాద్రి, వెలుగు :  ‘మీరు ఆడికి పోయినా వేస్టే.. నేను ప్లేట్​పట్టుకున్నాకే మీకు బుక్క’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి జిల్లా గుండాలలో గురువారం నిర్వహించిన ‘పల్లె ప్రగతి’కి మంత్రి ఎర్రబెల్లి కొంత ఆలస్యంగా వచ్చారు. ఆయన తన ప్రసంగం ప్రారంభించే సమయానికి భోజనం టైమ్ మించిపోవడంతో సభకు వచ్చిన జనాలు భోజనాల వైపునకు వెళ్తున్నారు. దీంతో మంత్రి పై విధంగా మాట్లాడారు. అక్కడున్న బీఆర్ఎస్​ లీడర్లు కలుగజేసుకొని ‘మంత్రి తిన్న తర్వాతే మనం తినాలి’ అంటూ, భోజనాల వద్ద ప్లేట్లు తీసేయాలని నిర్వాహకులకు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. కాంగ్రెస్, బీజేపీ గురించి ప్రస్తావిస్తూ ‘వాడు.. వీడు’ అంటూ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్​ ప్రారంభించిన సుపరిపాలనను సీఎం కేసీఆర్ ​పరిపూర్ణం చేశారని తెలిపారు. తన నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న గుండాలను దత్తత తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. దీంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత లేచి ఎర్రబెల్లి కాళ్లు మొక్కబోగా ఆయన వారించారు. అనంతరం వడ్డీ రాయితీ రుణాలు, స్త్రీ నిధి రుణాల చెక్కులను మంత్రి అందించారు. సుద్దాలలో నిర్మించిన బ్రిడ్జీని ప్రారంభించారు. 

మిర్యాలగూడ/గరిడేపల్లి/కోదాడ/మఠంపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవానికి మిర్యాలగూడ మండలం శ్రీనివాస్​నగర్ లో నల్గొండ కలెక్టర్​ కృష్ణారెడ్డి, గుండాలలో ఆయిల్​ ఫెడ్​ చైర్మన్​ కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి, కలెక్టర్​ పమేలా సత్పతి, అడిషనల్​ కలెక్టర్​ దీపక్​ తివారి, గరిడేపల్లి మండలం పొనుగోడులో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ హాజరయ్యారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  మిర్యాలగూడ మండలం శ్రీనివాస్​ నగర్​ లో గ్రామపంచాయతీలో నల్లమోతు భాస్కర్​రావు,  చిలుకూరు మండలం బేతవోలులో బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి పనులను వివరించారు. మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామపంచాయతీ సపాయి కార్మికులను మిట్టపల్లి సర్పంచ్ దాసరి  విజయలక్ష్మి వెంకటరమణ సన్మానించారు.