నల్ల జెండాలు ఎగరెయ్యకపోతే రైతు బంధు వాపస్ ఇయ్యాలె

నల్ల జెండాలు ఎగరెయ్యకపోతే రైతు బంధు వాపస్ ఇయ్యాలె
  • కొద్ది రోజుల్లోనే కొత్త పింఛన్లిస్తాం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ, హనుమకొండ, వరంగల్, వెలుగు: కేంద్ర వైఖరిని నిరసిస్తూ శుక్రవారం ప్రతీ గ్రామంలో రైతులంతా తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని.. లేకపోతే రైతుబంధు వాపస్​ ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలో గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బీజేపీని బొందపెట్టాలని, లేదంటే కాలవెట్టాలన్నారు. యాసంగి వడ్లు కొనేదాక కేంద్రాన్ని ఇడిసిపెట్టేది లేదన్నారు. పండించిన ప్రతి గింజను కొంటామని మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సెంట్రల్​ గవర్నమెంట్​తో మాట్లాడి వడ్లను కొనిపించాలన్నారు. లేదంటే రైతుల కోసం మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు.  రైతు వ్యతిరేక చట్టాలను సీఎం కేసీఆర్​వ్యతిరేకించినందున కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై  కక్ష కట్టిందన్నారు. సిగ్గులేని బీజేపీ.. కేసీఆర్​ను తిప్పల పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణలో యాసంగిలో రా రైస్​ రాదన్నారు. పంట వేయడానికి ముందు వరి వద్దని రాష్ర్ట ప్రభుత్వం చెప్తే బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ రైతులను రెచ్చగొట్టి వరి వేసేలా చేశాడన్నారు. అందుకోసం పండించిన ప్రతీ ధాన్యం గింజను కేంద్రం కొనాలని డిమాండ్​ చేశారు. ఈనెల 11న ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.

ఐదారు రోజుల్లో కొత్త పింఛన్లు  
‘పింఛన్లు ఇచ్చే మంత్రిని నేనే.. కరోనా దెబ్బకు మూడేండ్లుగా కొత్త పింఛన్లు ఇయ్యలే. గిప్పుడు కరోనా నుంచి కోలుకున్నం.. ఐదారు రోజుల్లో కొత్త పింఛన్లు అందజేస్తాం’ అని మంత్రి దయాకర్​ రావు అన్నారు. కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీకి కేంద్రం మెండి చేయి చూపుతోందన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో లేట్ చేస్తోందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. విభజన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. జిల్లాలోని పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, పార్టీ కమిటీల సభ్యులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వరి కంకులను వేదిక వద్దకు తీసుకువచ్చి నిరసన తెలిపారు.