కేంద్రం పొగుడుతుంటే... బీజేపీ నేతలేమో తిడుతుండ్రు

కేంద్రం పొగుడుతుంటే... బీజేపీ నేతలేమో తిడుతుండ్రు

హనుమకొండ: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డు అందుకు నిదర్శమని మంత్రి చెప్పారు. తాగునీటి సరఫరాలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి 13 అవార్డులు వచ్చాయని, ఇప్పడు మరో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ 14 అవార్డులను అక్టోబర్ 2న తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. అవార్డులు, రివార్డులు తప్ప కేంద్రం నుంచి నయా పైసా రావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర నిధులతో ఆసరా పెన్షన్లు,  రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఓ వైపు కేసీఆర్ పాలన బాగుందని అవార్డులు ఇస్తూ.. ఇంకో వైపు టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా పని చేయడం లేదని బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ పని తీరును గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుద‌ర్శన్ రెడ్డి, చంటి క్రాంతి కిర‌ణ్‌, మిష‌న్ భ‌గీర‌థ ఈఎన్సీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.