జనజాతరలు ..కొత్తకొండకు భారీగా తరలివచ్చిన భక్తులు..ఆకట్టుకున్న రథాలు

జనజాతరలు ..కొత్తకొండకు భారీగా తరలివచ్చిన భక్తులు..ఆకట్టుకున్న రథాలు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా ఈ ఏడాది 69 రథాలు జాతరకే హైలైట్​గా నిలిచాయి. కోరమీసాలు, గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలతో మొక్కులు సమర్పించడానికి సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. 450 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఏకేవీఆర్​ కళాశాల ఎన్ఎస్ఎస్​వలంటీర్లు సేవలందించారు. కనుమ సందర్భంగా వీరభద్రుడికి పుష్పయాగం నిర్వహించారు. కాగా, గురువారం స్వామివారిని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్​దర్శించుకున్నారు. అనంతరం త్రిశూలం కూడలిని ప్రారంభించారు.    భీమదేవరపల్లి, వెలుగు

   ఐనవోలుకు పోటెత్తిన భక్తులు కనుల పండువగా పెద్ద బండి ఊరేగింపు

ఐలోని జనసంద్రమైంది.. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన పెద్దబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. మార్నేని వంశస్తుల ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన బండిని మాజీ టెస్కాబ్​ చైర్మన్​ మార్నేని రవీందర్​రావు ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. కాగా, స్వామివారిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, తక్కళ్లపల్లి రాజేశ్వర్​తోపాటు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్​రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్​రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.   - వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు