గ్రామ పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధం : మంత్రి ఎర్రబెల్లి 

గ్రామ పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధం : మంత్రి ఎర్రబెల్లి 

మహబూబాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని ఎన్నో హామీలను కూడా కేసీఆర్ నెరవేరుస్తున్నారని చెప్పారు. గత 70 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ప్రజలు గమనించారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్  పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. 

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను పరిశీలిద్దామంటూ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ గ్రామ పంచాయతీల కంటే ఇతర రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలు మెరుగ్గా ఉంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. గ్రామ సర్పంచులను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అవార్డులు కూడా తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులను మళ్లించినట్లు ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. 

ఇప్పటికే కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్లు రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రతి నెల ఇవ్వాల్సిన నిధులను ఇస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో.. రాష్ర్ట ప్రభుత్వం కూడా అన్నే నిధులు ఇస్తోందని చెప్పారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రేపు 10 వేల మంది ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్  నాయకులు కూడా వచ్చి కలెక్టరేట్ ను పరిశీలిస్తే బాగుంటుందని సూచించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాల్లో కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు.

సామాన్యులకు అందుబాటులో పరిపాలన

ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సామాన్యులకు కూడా పరిపాలన అందుబాటులోకి తీసుకురావడం కోసమే నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో  ఉన్న సచివాలయాల కంటే మన రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం మెరుగ్గా ఉందన్నారు.