వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పర్వతగిరి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడాదంతా నీళ్లు అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీనివల్ల భూమిలో తేమశాతం పెరిగి, ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారుతుందని చెప్పారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఓ రైతు పొలంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. అనంతరం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఆయిల్ పామ్ పంటల వల్ల ఎలాంటి నష్టం ఉండదని, అన్నీ లాభాలే అని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీతో ఈ మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అనుకున్న దానికంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఆఫీసర్లు రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. వర్ధన్నపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, జిల్లా కలెక్టర్ గోపి, జేడీఏ ఉషాదయాల్, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభం

రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లిలో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన నంగునూరి సోమయ్య జ్ఞాపకార్థం ఆయన కొడుకులు నంగునూరి అశోక్​, మోహన్​రావు, సంపత్​కలిసి రూ.20లక్షలతో ఆలయం నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నరసింహా నాయక్, ప్రధాన కార్యదర్శి పూస మధు, సర్పంచ్ గూడల్లి శ్రీలత ఉన్నారు.
 

వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలోని రాజేశ్వరీ సేవాసదన్ ​వృద్ధాశ్రమంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్​గెస్టుగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె.శైలజ హాజరై మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు. వృద్ధులకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా మండల న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.

ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ క్రైమ్, వెలుగు: వరంగల్ కమిషనరేట్ సెంట్రల్​ జోన్​ లో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ డా.తరుణ్​ జోషి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సుబేదారి సీఐగా ఉన్న ఏ.రాఘవేందర్​ ను వీఆర్​కు అటాచ్​చేయగా.. కమిషనరేట్ కు అలాట్​అయిన  ఎంఏ షుకూర్​కు సుబేదారి సీఐగా పోస్టింగ్​ఇచ్చారు. వీఆర్​లో ఉన్న ఇన్​స్పెక్టర్​ జి.వేణును మడికొండ పీఎస్​కు ట్రాన్స్​ ఫర్​ చేశారు. దీంతో సుబేదారి, మడికొండ పీఎస్​లలో ఇద్దరు కొత్త సీఐలు బాధ్యతలు తీసుకున్నారు.

ఇద్దరు తహసీల్దార్ల ట్రాన్స్ ఫర్

చిట్యాల, మల్హర్​, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్​భవేశ్​మిశ్రా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్హర్ తహసీల్దార్ శ్రీనివాస్​ను చిట్యాలకు ట్రాన్స్​ఫర్ చేయగా.. వెయిటింగ్​లో ఉన్న తహసీల్దార్ దివాకర్ రెడ్డికి మల్హర్ లో పోస్టింగ్ ఇచ్చారు. కాగా, రేగొండ మండలంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో గతంలో అక్కడ పనిచేసిన చిట్యాల తహసీల్దార్ ను ఇటీవల సస్పెండ్ చేశారు.

సల్లంగసూడు.. పోచమ్మ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. ఏటా శ్రావణమాసంలో ఈ బోనాలు నిర్వహిస్తుండగా.. ఈసారి అంగరంగ వైభవంగా పండుగ జరుపుకొన్నారు. మహిళలు డప్పుచప్పుళ్లు మధ్య పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. తమను సల్లగా చూడాలని వేడుకున్నారు. 
- వెలుగు నెట్ వర్క్

ఇన్ స్టాగ్రామ్ లో మహిళకు వేధింపులు    యువకుడి అరెస్ట్

వరంగల్​ క్రైమ్​, వెలుగు: ఇన్ స్టాగ్రామ్ లో ఓ మహిళకు అసభ్యకర మెసేజ్​లు పంపి, వేధింపులకు గురిచేసిన యువకుడిని వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మల్లేశ్ వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం సింగారానికి చెందిన కలకోట్ల రాజేశ్ ఇంటర్​చదివి, సెంట్రింగ్ పని చేస్తున్నాడు. ఇన్​ స్టాగ్రామ్​లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్​చేసి, వరంగల్​ గిర్మాజీపేటకు చెందిన ఓ యువతికి మెసేజ్​లు పంపడం స్టార్ట్ చేశాడు. ఆమె తో పాటు ఆమె స్నేహితులు, బంధువులకు కూడా అసభ్యకరంగా మెసేజ్​లు పంపాడు. ఆకాశ రామన్న పేరుతో ఉత్తరాలు కూడా రాసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కొద్దిరోజుల కింద బాధిత యువతి పోలీసులకు కంప్లైంట్​ చేసింది. సీఐ మల్లేశ్​, సైబర్​ క్రైమ్​ సీఐ జనార్దన్ రెడ్డి టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని అరెస్ట్​ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐలు మల్లేశ్​, జనార్దన్​ రెడ్డి, సిబ్బంది రాజు, నాగరాజు, సంతోష్​, సాజిద్​, శివను వరంగల్​ ఏసీపీ కలకోట గిరి కుమార్ ​అభినందించారు.


ఎమ్మెల్యేవన్నీ పచ్చి అబద్ధాలే

నర్సంపేట, వెలుగు: నర్సంపేట అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ స్టేట్ లీడర్​, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ఫైర్ అయ్యారు. మూడేండ్ల కింద ఇచ్చిన హామీలకే నేటికీ అతీగతీ లేదని విమర్శించారు. ఆదివారం నర్సంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి రూ.50కోట్లు వచ్చాయని చెబుతున్న పెద్ది, అందుకు తగ్గ ఆధారాలు చూపించాలన్నారు. గత ఎన్నికల సమయంలో కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేసిన పెద్ది.. వాటిని పూర్తి చేయకపోగా.. మళ్లీ కొత్త బిల్డింగులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడం పెద్దికి అలవాటుగా మారిందన్నారు.

బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ సర్పంచ్

నర్సంపేట మాజీ సర్పంచ్ ​చిలువేరు రజనీ భారతి టీఆర్ఎస్​ను వీడి రేవూరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆమెతో పాటు ఆమె భర్త చిలువేరు రమేశ్, టీఆర్​ఎస్​ మహిళా విభాగం లీడర్లు చందా స్రవంతి, చిందం విజయరాణి, బుధరావుపేటకు చెందిన టీఆర్ఎస్​ లీడర్లు మేడిశెట్టి శ్రీనివాస్, గద్దెల శంకర్ బీజేపీలో చేరారు. వారికి రేవూరి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

వజ్రోత్సవంలో వన మహోత్సవం

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి, నీళ్లు పోశారు. వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పంపిణీ చేశారు. అడవుల శాతంపైనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఇదిలా ఉండగా.. నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.    - వెలుగు నెట్ వర్క్

తొమ్మిది నెలలైనా పనులు పూర్తి చేయరా?

వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లోని 29వ డివిజన్ రామన్నపేటలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల్ని సీపీఎం లీడర్లు ఆదివారం పరిశీలించారు. పనులు ప్రారంభించి 9 నెలలు అవుతున్నా.. ఇంకా పూర్తి చేయడం లేదని చెప్పారు. నత్తనడక సాగుతున్న పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మేయర్ సొంత డివిజన్ అయినప్పటికీ పనులు పూర్తి చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం చేశారు. ఆఫీసర్లను అడిగితే కూడా సరైన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు.

సర్జరీ వికటించి మహిళ మృతి?

నర్సంపేట, వెలుగు: సర్జరీ వికటించి 40 ఏళ్ల మహిళ చనిపోయిన సంఘటన నర్సంపేట టౌన్​లో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుల సమాచారం ప్రకారం.. గూడూరు మండలం పొనుగోడుకు చెందిన ఓ మహిళకు కడుపులో గడ్డలు వచ్చాయి. దీంతో కొన్నేండ్లుగా పలు హాస్పిటళ్ల చుట్టూ తిరిగింది. రెండ్రోజుల కింద నర్సంపేట టౌన్​లోని బస్టాండ్ సెంటర్ సమీపంలో ఓ ప్రైవేట్ నర్సింగ్​హోంలో అడ్మిట్​అయింది. ఆదివారం ఉదయం సర్జరీ చేస్తుండగా తీవ్ర రక్తస్రావంతో మహిళ చనిపోయింది. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్​లో ఆందోళన చేశారు. డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు.

గంజాయి అమ్ముతూ దొరికిన్రు

కాజీపేట, వెలుగు: వరంగల్ ట్రైసిటీలో గంజాయి అమ్ముతున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 2.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు సిటీలోని మూడు గంజాయి స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేశామన్నారు. ఈ తనిఖీల్లో దేశాయిపేటకు చెందిన భరత్ సాయి, మిల్స్ కాలనీకి చెందిన గుర్రపు నాగేంద్ర, ములుగు వినయ్.. నయీంనగర్ కు చెందిన ఓర్సు నగేశ్, గండికోట సురేశ్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారని తెలిపారు. నిందితులు గంజాయిని 50గ్రాముల ప్యాకెట్లలో నింపి, స్టూడెంట్లకు, యువతకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐలు వెంకటేశ్వర్లు, నరేశ్ తదితరులున్నారు.

దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు

పర్వతగిరి, వెలుగు: కరెంట్ సామాగ్రిని చోరీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మామునూర్ ఏసీపీ నరేశ్​కుమార్​ వివరాల ప్రకారం.. మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మండలం మీట్యా తండాకు చెందిన బానోత్​శంకర్ ట్రాన్స్​ఫార్మర్ మెకానిక్ గా పనిచేసేవాడు. రిపేర్లకు వెళ్లే సమయంలో ఆయా ప్రాంతాలను గుర్తు పెట్టుకునే వాడు. తిరిగి అతడే కరెంట్ సామాగ్రిని దొంగతనం చేసేవాడు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితున్ని పట్టుకున్నారు. అతని వద్ద రూ.1లక్ష45వేల సొమ్మును రికవరీచేశారు.