ఆక్సిజన్ అడిగిన దానికంటే కేంద్రం ఎక్కువే ఇచ్చింది

ఆక్సిజన్ అడిగిన దానికంటే కేంద్రం ఎక్కువే ఇచ్చింది

 

  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా.. సీఎం పరిశీలనలో ఉంది: మంత్రి ఈటల
  •     కరోనా బిజీతో ఆయుష్మాన్, ఆరోగ్య శ్రీని కలపలే
  •     వారం, పది రోజుల్లో 3,010 ఆక్సిజన్ బెడ్లు రెడీ
  •     నిమ్స్ లో వీఐపీలకు 200 బెడ్లు

‘‘కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీలోకి చేర్చే అంశంపై సీఎం కేసీఆర్ కు పూర్తిగా అవగాహన ఉంది. దీన్ని తప్పకుండా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఓ కమిటీ వేసి, విధివిధానాలు రూపొందించాక  చేరుద్దామని సీఎం చెప్పారు’’ అని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చెప్పారు. మంగళవారం సెక్రటేరియట్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ స్కీమ్ లను మార్చి 31లోపే ఒకే స్కీమ్ గా చేయాల్సిందని, కానీ కరోనా కేసులు పెరగడంతో బిజీలో పడి చేయలేకపోయామని తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారిగా మిలటరీ విమానాల ద్వారా ఒడిశా నుంచి 160 టన్నుల ఆక్సిజన్ తరలించిన రాష్ట్రం తెలంగాణనే అని ఈటల అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కడైనా కొరత ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే.. కేంద్రం 400 టన్నులకు పైబడి కేటాయించిందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కు ఉత్తరం రాస్తే మరో 100 టన్నులు బళ్లారి నుంచి కేటాయించారని గుర్తు చేశారు.
 
రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ బెడ్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేశామని, గాంధీలో మరో 400 బెడ్స్ కు, నిమ్స్, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున బెడ్స్కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని జనరల్ హాస్పిటల్స్ లో 200 చొప్పున బెడ్స్ కలిపి మొత్తం 3,010 ఆక్సిజన్ బెడ్స్ వారం, పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 22 హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను పెట్టుకున్నామని, కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ నుంచి ఐదు మిషన్లు ఇస్తే గాంధీ, టిమ్స్, ఖమ్మం, భద్రాచలం, కరీంనగర్ లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిమ్స్ హాస్పిటల్ లో 200 ఆక్సిజన్ బెడ్స్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, వీఐపీల కోసం ఏర్పాటు చేయబోతున్నట్లు ఈటల వెల్లడించారు. నాచారంలోని 350 ఆక్సిజన్ బెడ్స్ తో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ గా బుధవారం నుంచి సేవలందించబోతుందని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్ మెంట్ కోసం చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈటల చెప్పారు.