ఈటలను రక్షించే బాధ్యత మా ప్రభుత్వానిదే..

ఈటలను రక్షించే బాధ్యత మా ప్రభుత్వానిదే..

కరీంనగర్: తెలంగాణలో హత్యా రాజకీయాలకు చోటు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ భేషుగ్గా ఉందన్నారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఈటల రాజేందర్ అనడంపై గంగుల పైవిధంగా స్పందించారు. కేసీఆర్ సర్కారులో రాజకీయ హత్యలు ఉండవని.. రాజకీయ ఆత్మహత్యలే ఉంటాయని కమలాకర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈటల మీద హత్యాయత్నం జరిగితే తన ప్రాణం అడ్డు పెట్టయినా కాపాడతానన్నారు.

రాజకీయ హత్యలకు చోటు లేదు

‘ఈటల రాజేందర్ నిండు నూరేళ్లు బతకాలి. నీతో రాజకీయ శతృత్వమే తప్ప వ్యక్తిగత శతృత్వమేమీ లేదు. నీకు, మాకు భూమి, ఆస్తి పంచాయతీలు లేవు. మీరు నన్ను ఎంత అన్నా పట్టించుకోం. కానీ కేసీఆర్‌ను విమర్శిస్తే మాట్లాడాల్సి ఉంటుంది. నీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిగా, ప్రజలు భయపడే విధంగా ఉన్నాయి. తెలంగాణలో హత్యలు చేసుకునేటువంటి రాజకీయ కక్షలు ఉన్నాయా అనే అనుమానాలు ప్రజలకు వస్తయ్. ఈ విషయంలో డీజీపీ వెంటనే విచారణ మొదలు పెట్టాలి. ఈటలకు చెవిలో చెప్పిన మాజీ నక్సలైట్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలి. ఆయన వ్యాఖ్యలు నిజమని తేలితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. నిజం కాకపోతే.. ఓట్ల కోసమో, సానుభూతి  కోసమో ఈ మాటలు చెప్పి ఉంటే.. ఈటల తప్పు ఒప్పుకుని రాజకీయాల నుంచి తప్పుకోవాలి’ అని గంగుల పేర్కొన్నారు.  

కేంద్ర సంస్థతో విచారణ చేయించాలె

‘బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీ పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మీరైనా విచారణ జరిపించండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ విచారణ మీకు నచ్చకపోవచ్చు. ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి దోషులను గుర్తించాలి. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ అలాంటి సంస్కృతి లేదు. ఈటలకు తాను ఓడిపోతాడని తెలిసిపోయినట్లుంది. అందుకే కొత్త డ్రామాకు ఆయన తెరతీశాడు. ప్రజలు కూడా ఈటలను పాదయాత్రలో అడగాలి. నిన్ను చంపాలని చూసిన మంత్రెవరని అడుగుతూనే ఉండాలి. ఈటల రాజేందర్ తన మనుషులతోనే దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోవాలి’ అని పోలీసులను గంగుల కోరారు.