ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయొద్దు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయొద్దు

కొత్తపల్లి, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కిలో తరుగు కూడా తీయవద్దని నిర్వాహకులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌‌‌‌పూర్, ఖాజీపూర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కొనుగోళ్లలో ఏ ఇబ్బందీ కలగకుండా చూస్తామని, ఎలాంటి దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరారు. గన్నీ బ్యాగులు లేవని, కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని, సెంటర్లలో ఇతర సామగ్రి అందుబాటులో లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా అబద్ధమని చెప్పారు. యాసంగిలో 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని, ధాన్యం సేకరణ మొదలుపెట్టినప్పుడే 1.60 కోట్ల బ్యాగులు రెడీ చేశామని వివరించారు. మిల్లర్ల నుంచి, రేషన్ డీలర్ల నుంచి కూడా ఆఫీసర్లు పాత గన్నీ బ్యాగులు సేకరించారన్నారు. ఈ నెలాఖరు వరకు 3 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా.. గురువారం నాటికి 6.85 కోట్ల బ్యాగులు రెడీ చేశామన్నారు. కొత్త బ్యాగుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టామని, వాటిని కూడా తెప్పిస్తామన్నారు. ధాన్యం తూకం అయిపోగానే రైతులు ఇంటికి వెళ్లొచ్చని, రైతులకు, రైస్ మిల్లులకు సంబంధం లేకుండా అధికారులే బాధ్యత తీసుకుంటారన్నారు.

రెండు రోజుల్లో అకౌంట్లలో డబ్బులు
రాష్ట్రంలో 6,920 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి గంగుల చెప్పారు. అవసరమైతే అదనంగా సెంటర్లు తెరవాలని ఆఫీసర్లను ఆదేశించామన్నారు. ఇప్పటికే 2,384 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, 873 కేంద్రాల్లో లక్షా 86 వేల టన్నుల ధాన్యాన్ని కొన్నామని, ఇందులో లక్షా 74 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని తెలిపారు. తూకం వేసిన రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. కరీంనగర్ జిల్లాలో 352 సెంటర్లకు గాను 180 సెంటర్లను ప్రారంభించామన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని గంగుల ఆరోపించారు. కేంద్రం చేతులెత్తేసినా సీఎం కేసీఆర్ రైతుకు అండగా నిలబడాలని నిర్ణయించారని, రాష్ట్రంలో పండిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని చెప్పారు. వడ్లు కొనబోమంటూ ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ఇలాంటి ఆంక్షల వల్ల రైతు పంటలు పండించడం మానేస్తే దేశానికి అన్నం ఎవరు పెడతారని, శ్రీలంక లాంటి సంక్షోభం తలెత్తితే ఎలా అన్ని ప్రశ్నించారు.