ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. శనివారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో పలు అభివృద్ధి పనులను స్థానిక ప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పటాన్​చెరు లో ఏర్పాటు చేసిన  తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి అధికారికంగా నిర్వహించడమే కాకుండా 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​దేనన్నారు. రాష్ట్రంలోని 2,475తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేశామన్నారు. త్వరలో 81 వేల రాష్ట్ర ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అందించబోతున్నట్లు తెలిపారు. పటాన్​చెరులో నియోజకవర్గంలో వెయ్యి గజాల్లో బంజారా భవన్ నిర్మాణానికి  కృషి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో  గిరిజన విద్యార్థుల కోసం ఒక కళాశాల కూడా లేదని, నేడు రాష్ట్రవ్యాప్తంగా 75 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం స్థలం రెడీగా ఉందని, ఇప్పటి వరకు రాష్ట్రానికి యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16  లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. ఆయన వెంట శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేశ్, సింధు పార్టీ నాయకులు ఉన్నారు. 

 

 

ప్రతి ఒక్కరూ సైనికుడిలా పని చేయాలి

  కార్యకర్తలకు బీజేపీ నేతల పిలుపు

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పలువురు పార్టీ నేతలు పిలుపునిచ్చారు.  శనివారం ఉమ్మడి మెదక్​ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించారు.  ఈ సందర్భంగా మెదక్​లో నిజామాబాద్​ ఎంపీ, మెదక్ అసెంబ్లీ పాలక్​ ధర్మపురి అర్వింద్,  జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్​రావు, జోగిపేటలో  మాజీ మంత్రి బాబు మోహన్, నారాయణఖేడ్​లో రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, హుస్నాబాద్​లో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్,  సిద్దిపేటలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్ దేశ్​పాండే, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, సంగారెడ్డిలో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నర్సాపూర్​లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి, అసెంబ్లీ కన్వీనర్ మల్లేశ్​గౌడ్, తదితర నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలకు వివరించారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఇకపై కేసీఆర్ అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు బూత్ కమిటీ సభ్యులతో పార్టీ పలువురు బడా నేతలు వర్చువల్ గా పాల్గొని దిశానిర్దేశం చేశారు.