గవర్నర్​ను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు : మంత్రి హరీశ్ రావు

గవర్నర్​ను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు : మంత్రి హరీశ్ రావు

మెదక్, వెలుగు: గవర్నర్​ను అడ్డుపెట్టుకొని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు.  ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఎరుకల ఎంపవర్​మెంట్​ స్కీమ్​ను గురువారం మహిళా, శిశు, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎరుకల కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి వస్తే  ఆ జాతి మొత్తం బీఆర్ఎస్​కు అనుకూలంగా ఉంటుందని గవర్నర్​కు భయమని, అందుకే ఎరుకల జాతికి చెందిన కుర్ర సత్య నారాయణ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ లో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్​లో అధికారంలో ఉన్న బీజేపీ ఆ పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు కేటాయించట్లేదా అని మండిపడ్డారు. ఎరుకలు, విశ్వ బ్రాహ్మణులు బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.  కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.

గుండాల గ్యాంగ్​ వస్తోంది..

మెదక్ టౌన్: గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు మహిళా ​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి మీద పోటీకి హైదరాబాద్​ నుంచి గుండాల గ్యాంగ్​ వస్తోందని మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. పెద్ద పెద్ద కార్లలో నోట్ల కట్టలతో వస్తున్నవారిని.. వారు గెలిస్తే  కైలాసంలో పెద్ద పాము మింగినట్టు అవుతుందన్నారు. మెదక్ జిల్లా కేంద్రాన్ని, మెడికల్​ కాలేజీని సాధించిన, మెదక్ నియోజకవర్గాన్నిఎంతో అభివృద్ధి చేసిన పద్మా దేవేందర్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్​ రావు,  ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్మెన్​ హేమలత,  వైస్​ చైర్మెన్​ లావణ్య, మున్సిపల్  వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.

సిద్దిపేటలో ముదిరాజ్ కన్వేన్షన్ సెంటర్ ప్రారంభం

సిద్దిపేట పట్టణంలో 7.50 కోట్ల తో నిర్మించిన ముదిరాజ్ కన్వేన్షన్ సెంటర్ ను మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. పనులను పూర్తి చేసేందుకు  మరో రూ. 50 లక్షలు కేటాయిస్తానన్నారు.  రాష్ట్రంలో కొత్తగా రెండు  వేల  సొసైటీల ను ఏర్పాటు చేసి 2 లక్షల మందికి కొత్తగా సభ్యత్వాలు ఇస్తామన్నారు. శాసనమండలి చైర్మన్ బండ ప్రకాశ్​మాట్లాడుతూ..  కొత్తగా ఏర్పాటు చేసిన  ముదిరాజ్ సొసైటీల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ముదిరాజ్ బిడ్డకు సభ్యత్వం కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ రవీందర్ పాల్గొన్నారు.