14న వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని.. పండుగలా చేయాలె: హరీశ్

14న వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని.. పండుగలా చేయాలె: హరీశ్

హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14వ తేదీన నిర్వహించే తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పండుగలా చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. తొమ్మిదేండ్లలో వైద్య ఆరోగ్య శాఖ సాధించిన విజయాలు ప్రజలకు తెలిసేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావుతో కలిసి మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 14వ తేదీన నిర్వహించాల్సిన కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. కేసీఆర్ కిట్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ముందుగానే అన్ని జిల్లాలకు కిట్లు పంపించాలన్నారు. నిమ్స్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీఎస్ ఎంఎస్ఐడీసీ ద్వారా హాస్పిటల్స్​లో చేపడుతున్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గాంధీ హాస్పిటల్​లో నిర్మిస్తున్న ఆర్గాన్ ట్రాన్స్​ప్లాంటేషన్ సెంటర్, గాంధీ, ఎంజీఎం, పేట్లబుర్జు హాస్పిటల్స్​లో నిర్మిస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.