
గ్లకోమా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలన్నారు మంత్రి హరీశ్ రావు. అవగాహన లేక ఈ వ్యాధిని గుర్తించలేకపోతున్నారని తెలిపారు. వరల్డ్ గ్లకోమా డే సందర్భంగా సరోజినీ దేవి ఐ హాస్పిటల్ లో వరల్డ్ గ్లాకోమా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీపీ షుగర్ ఉన్న వారికి, అలాగే పని ఒత్తిడి ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని మంత్రి హరీశ్ తెలిపారు. ఈ వ్యాధి వస్తే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు . రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేవలం ఐదు నెలల్లో కోటి యాభై లక్షల మందికి కంటి పరీక్షలు చేసి.. 40 లక్షల మందికి ఉచితంగా కళ్ళజోడు అందించారన్నారు.