ఇక్కడి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలైతలేవు

ఇక్కడి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలైతలేవు

బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై మంత్రి హరీశ్‌‌ రావు ఫైర్‌‌‌‌ 
వరంగల్‌‌ హాస్పిటల్‌‌ పనులు 15% పూర్తయ్యాయి

సిద్దిపేట, వెలుగు: తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్‌‌ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలు మాట్లాడారని మంత్రి హరీశ్‌‌ రావు మండిపడ్డారు. జిల్లా జైలును కూల్చి హాస్పిటల్‌‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నా ఆస్పత్రి ఏమాయే అంటూ మాట్లాడం ప్రజల్ని అయోమ యానికి గురిచేయడమేనన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్లు ఇస్తూ ఆదుకుంటుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలా పెన్షన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. వరంగల్‌‌లో మూడు నెలల క్రితం 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు 15 శాతం పూర్తయ్యాయని, అదే బీబీ నగర్‌‌‌‌లో కేంద్రం చేపట్టిన ఎయిమ్స్ హాస్పిటల్‌‌ కోసం కనీసం ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు.

వరంగల్ హాస్పిటల్‌‌ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో కిషన్ రెడ్డి తనతో వస్తే చూపిస్తానన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్ని తామే ఇచ్చామని చెప్పుకునే బీజేపీ నేతలు, అవే పథకాలు గుజరాత్‌‌లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల కోసం సిద్దిపేటలో మరో 5 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 

చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
డీఆర్‌‌‌‌డీఏ ఆధ్వర్యంలో గతేడాది యాసంగి సీజన్‌‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా, మండల సమాఖ్య, గ్రామైక్య సమాఖ్య సంఘాలకు కమీషన్ చెక్కులను హరీశ్ పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో రచయిత శాంతికుమారి పుస్తకాన్ని ఆవిష్కరించి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని సన్మానించారు. తర్వాత జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజక్టుల ప్రగతిపై క్యాంపు ఆఫీసులో అధికారులతో సమీక్షించారు.

కొండా లక్ష్మణ్​ బాపూజీ కాంస్య విగ్రహావిష్కరణ
సిద్దిపేట పట్టణంలో పద్మశాలి సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించి మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం విలువలకు కట్టుబడి బతికారని, ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కొండా లక్ష్మణ్ రాజీనామా చేస్తే, ఆయన స్పూర్తితో మలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారని గర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో హ్యాండ్లూమ్ బోర్డ్ ఏర్పాటు చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానితో పాటు హ్యాండిక్రాఫ్ట్ బోర్డ్, పవర్ లూమ్ బోర్డ్‌‌ను రద్దు చేసిందని, దీంతో 8 పరిశోధన సంస్థలు కూడా రద్దయ్యాయని చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంచారని, ఈ రంగం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం వారికి అండగా ఉన్నదని వివరించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం రూ. 600 కోట్ల విలువైన బతుకమ్మ చీరలకు ఆర్డర్‌‌‌‌తో పాటు వజ్రోత్సవాల్లో భాగంగా 1.20 కోట్ల జాతీయ జెండాలను చేనేత కార్మికులకు ఆర్డర్‌‌‌‌ ఇచ్చి వారికి అండగా నిలిచిందన్నారు.