ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట దశాబ్దాల కల అయిన రైలు రాక వచ్చే ఏడాది మేలోపు తీరనుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి నిర్మాణంలో ఉన్న దుద్దెడ రైల్వే స్టేషన్ వరకు దాదాపు 11 కిలో మీటర్ల మేర జరుగుతున్న రైల్వే ట్రాక్ ​ ఏర్పాటు పనులు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్చిలో దుద్దెడకు రైలు వస్తుందని, ఏప్రిల్, మే నెలలోపు సిద్దిపేటకు వచ్చేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో చాలా మంది లీడర్లు సిద్దిపేటకు రైలు తీసుకొస్తామని చెప్పారు కానీ చేయలేదు.. ఆ కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని చెప్పారు.  అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీస్ లో చిన్నకోడూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలలోని కుల సంఘ భవనాలకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు.  ఆ తర్వాత కోదండరావుపల్లి గ్రామ రెవెన్యూ భూ సమస్యను పరిష్కరిస్తూ గ్రామంలోని 46 మంది లబ్ధిదారులకు భూ పట్టాలు పంపిణీ చేశారు. నంగునూరు మండలంలోని రాంపూర్ గ్రామ రేణుకా ఎల్లమ్మ దేవాలయం కోసం స్థలాన్ని ఇస్తూ ధ్రువీకరణ పత్రాన్ని గౌడ సంఘ సభ్యులకు అందజేశారు. మంత్రి వెంట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు

పటాన్​చెరు, వెలుగు : పారదర్శకంగా డబుల్ ​బెడ్​రూమ్​ ఇండ్లను కేటాయిస్తున్నామని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని నర్రెగూడెంలోని డబుల్ ​బెడ్​ రూమ్​ఇండ్లకు పటాన్​చెరులోని జీహెచ్​ఎంసీ మల్టీపర్పస్​ పంక్షన్​ హాల్​లో మంగళవారం  డ్రా పద్ధతిలో 80 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్డీఓ నగేశ్, అమీన్​పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, పటాన్​చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. 

మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే 

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. 

ల్యాండ్​ పూలింగ్​ స్పీడప్​ చేయాలి 

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో వివిధ పనులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ స్పీడప్​ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్​లో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డితో కలిసి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో భూ సమీకరణ, హై వాల్యూ కాలనీస్, స్ట్రే బిట్స్, జీవో 59 దరఖాస్తులు, ధరణి  తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు లేకుండా ల్యాండ్​ పూలింగ్​ పూర్తి కావాలన్నారు. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమగ్ర నివేదికను అందించాలని చెప్పారు.  హైవాల్యూ కాలనీలలో ఉన్న స్ట్రే బిట్స్ , వివిధ కాలనీలలో ఉన్న హై వాల్యూ ప్లాట్ల వివరాల జాబితా అందించాలన్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించడంలో ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. 

అభివృద్ధి పనులపై... 

కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్ రాజార్జి షాతో కలిసి  టీఎస్ఎంహెచ్ఐడీసీ, నీటి పారుదల, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్  ఇంజనీర్లతో వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్​ సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి భవనాల నిర్మాణాలపై  మాట్లాడుతూ అగ్రిమెంట్ ​ప్రకారం నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. పూర్తయిన బిల్డింగ్​లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని చెప్పారు. నీటిపారుదల శాఖకు సంబంధించి సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపు హౌస్ లు, గ్రావిటీ కెనాల్, అప్రోచ్ కెనాల్స్ కు  భూసేకరణ,  కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 19, కాలువల పునరుద్ధరణ, నల్ల వాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ, తదితర పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. 

మంత్లీ క్రైమ్ రివ్యూ..

సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయం, రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నేరస్తులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలన్నారు. ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ లాంగ్ పెండింగ్ కేసులలో ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని కేసులు పరిష్కరించాలని సూచించారు. అడిషనల్​ ఎస్పీ ఉషా విశ్వనాథ్ జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. 

మమ్మల్ని రెగ్యులర్​ చెయ్యాలె  

కంది, వెలుగు :  తమను ఉద్యోగాల నుంచి తీసేయొద్దని, సుప్రీంకోర్టు ఆర్డర్​ను అమలు చేయాలని, ఏండ్లుగా పని చేస్తున్న తమను పర్మినెంట్​ చేయాలని ఏపీజీవీబీ బ్యాంక్​ మెసెంజర్లు డిమాండ్​ చేశారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఏపీజీవీబీలో పని చేస్తున్న మెసెంజర్లు మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏపీజీవీబీ హెడ్​ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏండ్లుగా తాము ఏపీజీవీబీలో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా  ఉన్నతాధికారులు గత జూలై నుంచి  విధులకు రానివ్వడంలేదని తెలిపారు. తమ ప్లేస్​లో ఇతరులను చేర్చుకున్నారని చెప్పారు. బీజేపీ స్టేట్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్​, సంగారెడ్డి  నియోజకవర్గ ఇన్​చార్జి రాజేశ్వర్​రావు దేశ్​పాండే, సీఐటీయూ, కేవీపీఎస్​ నాయకుడు మాణిక్యం, తదితరులు వారికి మద్దతు తెలిపారు. యూనియన్​నాయకులు, ప్రజా ప్రతినిధులు ఏపీజీవీబీ చైర్మన్​ ప్రవీణ్​కుమార్​తో చర్చలు జరిపారు. ఈనెల 23న సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు కొత్త రిక్రూట్​మెంట్​ చేసుకోబోమని, పాత మెసెంజర్లు విధులకు రావొద్దని, రావాలనుకునే వారు ఎజెన్సీ ఫాంలో సంతకం చేసి రావొచ్చన్నారని తెలిపారు. దీంతో మెసెంజర్లు​ఆందోళన విరమించారు. 

పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలం

మెదక్​టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు : పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలుగుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌ అన్నారు. బీసీ విద్యార్థి- యువజనుల పోరుయాత్రలో భాగంగా మంగళవారం మెదక్, సిద్దిపేట పట్టణాల్లో ఆయన మాట్లాడారు.  విద్య,  వైద్యం జాతీయం చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్​మెంట్స్​ రూ.3,250 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లో పుట్టడమే విద్యార్థులు చేసుకున్న నేరమా అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆమరణదీక్ష కైనా వెనుకాడబోనని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 6 శాతం ఉన్నవారు పరిపాలన కొనసాగిస్తుంటే 60 శాతం ఉన్న వారు ఎందుకు పరిపాలించరాదని, ఈ విషయాన్ని విద్యార్థులు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రతి ఊరుకూ పాఠశాలలు, కాలేజీలు, ప్రతి జిల్లాకూ ఒక  యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యావంతులు కోరుతుంటే, రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా 4750 ప్రభుత్వ స్కూళ్లను మూసేసి వంద మందికి ఒక బెల్ట్ షాపు, వెయ్యి మందికి ఒక వైన్ షాపు, 3000 మందికి ఒక బార్ షాపు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణను బార్ల, బీర్ల తెలంగాణ మారుస్తోందని మండిపడ్డారు. రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.