
రైతులకు గుదిబండగా మారిన నల్ల చట్టాలు రద్దు రైతుల విజయమన్నారు మంత్రి హరీశ్ రావు. ఏడాది కాలం తర్వాత రైతుల పోరాటంతో కేంద్రం దిగొచ్చిందన్నారు. నల్ల చట్టాలు అమలైతే వ్యవసాయం కార్పోరేట్ పాలయ్యేదన్నారు. మెదక్ జిల్లా చిన్నకోడూర్, పెద్ద కోడూర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు మంత్రి హరీశ్ . ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ రైతుల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు మంత్రి హరీశ్ రావు. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారన్నారు. రైతులు ఆందోళనల పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వాన కాలం పంట మొత్తం తెలంగాణ ప్రభుత్వం కొంటుందని.. వడ్లు కొనేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. సాధ్యమైనంత త్వరగా వాన కాలం ధాన్యం పంట కొంటామన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా .. వానాకాలం పంట ను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు.
వర్షాల కారణంగా వడ్లు ఎండక పోవడంతో ధాన్యం కొనడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు మంత్రి హరీశ్. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు రోజుకు రెండు గంటల పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
యాసంగి నుంచి వడ్లు కొనం అనే కేంద్ర నిర్ణయం సరి కాదని.. విధానాలను మార్చుకోవాలన్నారు. పారా బాయిల్డ్ రైస్ కొనం అనే కేంద్ర నిర్ణయం.. పుండు మీద కారం చల్లినట్లుందన్నారు. భారతదేశంలో పండిన ధాన్యాన్ని ఆఫ్రికా తో పాటు ఇతర ప్రప్రంచ దేశాలకు ఎగుమతి చేయాలని అన్నారు.