త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ : మంత్రి హరీష్ రావు

త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ : మంత్రి హరీష్ రావు
  • రెండేండ్లలో జిల్లాకో మెడికల్​ కాలేజీ ఏర్పాటు
  • త్వరలో 2,900 పల్లె దవాఖాన్లు ఏర్పాటు చేస్తం
  • కాళేశ్వరంతో నీళ్లు రాలేదంటే చెంప చెల్లుమనిపిస్త : హరీశ్

సిద్దిపేట రూరల్/ కరీంనగర్ సిటీ, వెలుగు : గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. రెండేండ్లలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట, కరీంగనర్​లలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ‘‘కేంద్రం యువతను నిర్వీర్యం చేస్తూ, అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు విధానం తేవడం హేయమైన చర్య’’ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని.. వాటిలో 17 వేలు పోలీసు ఉద్యోగాలేనని తెలిపారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వివరించారు.

కాళేశ్వరంతో భూమికి బరువయ్యేంత పంట

కాళేశ్వరంతో భూమి బరువయ్యేంత పంట పండిందని, దీనికంటే ముందే ప్రారంభమైన పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదని.. ఇంకో ఐదేండ్లయినా పోలవరం పూర్తి కాదని హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో పోలవరం తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తై పంటలకు నీరు కూడా అందుతుందన్నారు. పోలవరం ఇంజనీర్లను అడిగితే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదు అనేవాళ్లు తన ముందుంటే చెంప చెల్లుమనిపించే వాడినని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

17 మెడికల్​ కాలేజీలు పెట్టాం

రాష్ట్రం వచ్చాక 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని హరీశ్ రావు​ చెప్పారు. వచ్చే ఏడాది మరో తొమ్మిది కాలేజీల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మెడిసిన్ చదివేందుకు స్టూడెంట్లు ఇక ముందు చైనా, ఉక్రెయిన్, రష్యా పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,900 పల్లె దవాఖాన్లు ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా 3,800 గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులోకి రానున్నారని తెలిపారు. నర్సింగ్ కోర్సులో స్పెషలైజేషన్​ను తెస్తున్నామని,  పారా మెడికల్​లోనూ  కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని తెలిపారు.