
ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కేసీఆర్ శిక్షణ శిబిరంలో శిక్షణను అందిపుచ్చుకొని ఉద్యోగం సాధించాలని సూచించారు. మెయిన్స్ ఎగ్జామ్ జీవితానికి పరీక్ష వంటిదని.. అభ్యర్థులు కష్టపడి చదివాలన్నారు. తుది దశ ట్రైనింగ్ కి 31లక్షల రూపాయలు ఖర్చు చేసి 450మందికి శిక్షణ ఇస్తామన్న ఆయన.. శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈవెంట్స్లో క్వాలిఫై కాని వారికి అవకాశం ఇవ్వాలని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. 317జీవోను రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానికులకు ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.