ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్,వెలుగు: మార్కెట్​ కమిటీ పాలకవర్గాలు రైతుల మేలు కోసం పనిచేయాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి కోరారు. రైతు సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. గురువారం సారంగాపూర్​ మార్కట్​ కమిటీ  చైర్మన్ గా అశ్రిత, వైస్ చైర్మన్ గా దత్తురాం, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి మంత్రి చీఫ్​గెస్ట్​గా హారయ్యారు. అంతకుముందు నిర్మల్​లో మంత్రి ఆసరా లబ్ధిదారులకు పెన్షన్​ కార్డులు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవన్నారు. సీఎం కేసీఆర్​ రైతుల కోసం మరిన్నీ పథకాలు అమలు చేసే యోచనలో ఉన్నారన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక రమణ తదితరులు పాల్గొన్నారు.

నేషనల్​ హైవే భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి

ఆసిఫాబాద్,వెలుగు: నేషనల్​ హైవే, చెరువులు, కాల్వల నిర్మాణ పనుల కోసం భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ రాజేశంతో కలిసి నేషనల్​హైవే అథారిటీ, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు, సింగరేణి ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. నేషనల్​హైవే పెండింగ్​ పనులు తొందరగా కంప్లీట్​ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సురేశ్, ఆర్డీవో సిడాం దత్తు , నేషనల్​ హైవే అథారిటీ పీవో ఎం.రవీందర్ రావు, ఎస్ వోటు జీఎం కేహెచ్​ఎన్ ​గుప్తా, ఇరిగేషన్ ఈఈ జె.గుణవంత్ రావు పాల్గొన్నారు.

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి

ఆదిలాబాద్, వెలుగు: దళిత బంధు పథకం కింద మంజూరైన 249 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. దళిత బస్తీ, దళిత బంధు, ఓడీఎఫ్ ప్లస్, పెన్షన్, హరితహారం పథకాలపై చర్చించారు. దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 24.90 కోట్ల జమ చేయడం జరుగుతుందన్నారు. దళిత బస్తీ పథకం కింద గుర్తించిన భూముల వివరాలు, లబ్ధిదారులకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఓడీఎఫ్ ప్లస్ కింద ప్రకటించిన 117 గ్రామ పంచాయతీల్లో మండల టీంలు పరిశీలించి 10వ తేదీలో గా నివేదిక ఇవ్వాలన్నారు. కొత్తగా మంజూరైన 15,474 పింఛన్ల గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే సమక్షంలో ఇవ్వాలన్నారు. మరణించిన, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, ఉద్యోగులు, అనర్హులుగా ఉన్న వారిని గుర్తించి పెన్షన్లు నిలిపివేయాలన్నారు. హరితహారం కింద నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ కంప్లీట్​ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, ట్రెయినీ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేశ్​రాథోడ్, డీఎఫ్​వో రాహుల్, జడ్పీ సీఈఓ గణపతి, డీఆర్డీవో కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ పాల్గొన్నారు. 

ఓదెలుపై హైకమాండ్​కు ఫిర్యాదు

మంచిర్యాల, వెలుగు: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలుపై ఏఐసీసీ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ కాంగ్రెస్ అధిష్టానానికి గురువారం కంప్లైంట్ చేశారు. ఓదెల దంపతులు కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా, సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, గత నెల 28న జరిగిన మీటింగ్ కు మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఓదెలు దంపతులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియాంకగాంధీ సమక్షంలో కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. అప్పటినుంచి ఓదెలు ప్రేమ్ సాగర్ రావు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఓదెలు వచ్చే ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తుండగా, ప్రేమ్ సాగర్ రావు తన అనుచరుడైన రమేశ్​ ను అక్కడి నుంచి రంగంలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నారు. దీంతో ఓదెలుకు వ్యతిరేకంగా మొదటి నుంచి పావులు కదుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఓదెలు దంపతులే పార్టీ కార్యక్రమాల్లో తమతో కలిసి రావడం లేదని డీసీసీ చైర్ పర్సన్ సురేఖ అంటున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప వీరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

విద్యార్థిని మృతికి కారణమైన వారిపై హత్య కేసు పెట్టాలి

ఆసిఫాబాద్,వెలుగు: స్థానిక గిరిజన గురుకుల కళాశాల విద్యార్థిని మృతికి కారకులైన ఆర్సీవో, ప్రిన్సిపాల్, వైద్యులు, జిల్లా అధికారులపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి, జిల్లా అధ్యక్షుడు సంతోష్ , సిర్పూర్ నియోజకవర్గ ఇన్​చార్జి అర్షద్ హుస్సేన్ డిమాండ్​చేశారు. గురువారం ఎస్పీ ఆఫీస్​లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీ జిల్లాలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని.. అయినా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పోస్టుమార్టం చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లావుడ్య మంగీలాల్, తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న మార్క్స్ అంబేద్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దార మధు తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీవోకు వినతి...
వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల మృతిపై విచారణ జరిపించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి , కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి నైతం రాజు డిమాండ్​ చేశారు. గురువారం వారు ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డికి  వినతిపత్రం అందజేశారు.

సమర దీక్షను సక్సెస్ చేయండి

భైంసా,వెలుగు: ముథోల్​ఐబీ వద్ద శుక్రవారం నిర్వహించే సమర దీక్షను సక్సెస్ చేయాలని టీజేఎస్ సెగ్మెంట్​ఇన్​చార్జి సర్దార్ వినోద్ కుమార్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. దీక్షకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్లు​కోదండరామ్,​ హరిగోపాల్, గంగాపురం వెంకట్ రెడ్డి, విశ్వేశ్వరరావు, భైరీ రమేశ్, జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.

పాడి రైతులను ఆదుకోవాలి

రామకృష్ణాపూర్,వెలుగు: జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ధి పరుస్తూ రైతులను అన్ని విధాల ఆదుకోవాలని జిల్లా విజయ డెయిరీ పాడి రైతుల సంఘం ప్రెసిడెంట్ వీరమల్ల రాజయ్య కోరారు. గురువారం నూతనంగా జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్​ రమేశ్​ను పాడి రైతులు సన్మానించారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకవచ్చారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు పాడి అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.  ప్రతీ గ్రామంలో పాలమిత్ర సొసైటీ లు ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏఈ డాక్టర్​ శంకర్​, పాడి రైతులు పాల్గొన్నారు.  

ఉద్యోగాల పేరుతో మోసగిస్తే చర్యలు

ఆసిఫాబాద్/జైనూర్,వెలుగు: ఉద్యోగాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సురేశ్​కుమార్ హెచ్చరించారు. ఈనెల 4న సింగరేణిలో ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షకు సంస్థ సూచించే నియమ నిబంధనలు పాటించాలన్నారు. మోసాలకు పాల్పడేవారి వివరాలు పోలీసులకు తెలపాలని సూచించారు. లింగాపూర్ మండలంలోని లెండిగూడ, మందిరి గూడ ప్రాంతాల్లో బుధవారం ఎస్పీ తిరిగారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించడానికి పోలీసులు ముందుంటారన్నారు. మావోయిస్టులకు ఎవరూ సహకరించొద్దన్నారు. అనుమానాస్పదంగా తిరిగే వారి సమాచారం ఇవ్వాలని కోరారు.