అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి: మంత్రి జగదీశ్‌‌రెడ్డి

అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి: మంత్రి జగదీశ్‌‌రెడ్డి

సూర్యాపేట, వెలుగు : అట్రాసిటీ కేసుల్లో ఆఫీసర్లు బాధితులకు అండగా ఉండాలని విద్యుత్‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌రెడ్డి సూచించారు. ఎస్సీ డెవలప్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్‌‌ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన విజిలెన్స్‌‌ అండ్‌‌ మానిటరింగ్‌‌ కమిటీ మీటింగ్‌‌లో మంత్రి మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఫిర్యాదులు తీసుకోవడంలో ఆలస్యం చేసే పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు స్టేషన్‌‌కు వచ్చిన వెంటనే విచారణ జరిపి ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయాలని చెప్పారు. విజిలెన్స్‌‌ అండ్‌‌ మానిటరింగ్‌‌ కమిటీ సమావేశాన్ని మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణను పోలీసులు స్పీడప్‌‌ చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఆఫీసర్‌‌ దయానందరాణి, ఎస్సీ కార్పొరేషన్‌‌ ఏడీ బి,శిరీష, ట్రైబల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఆఫీసర్‌‌ శంకర్‌‌, ఫిషరీస్‌‌ ఆఫీసర్‌‌ రూపేందర్‌‌ సింగ్‌‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, కిశోర్‌‌కుమార్‌‌, వెంకారెడ్డి, విజిలెన్స్‌‌ అండ్ మానిటరింగ్‌‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బాలల సంరక్షణ అందరి బాధ్యత

మహిళ, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో కలెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కేంద్రాన్ని గురువారం మంత్రి జగదీశ్‌‌రెడ్డి ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి జగదీశ్‌‌రెడ్డి చెప్పారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పిల్లల సంరక్షణ, బాలల హక్కులు కాపాడేందుకు కోసం కృషి చేయాలని తెలిపారు. కలెక్టర్‌‌ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ కలెక్టరేట్‌‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ, ఎదుగుదల చూసేందుకు బాలల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు ఈ సెంటర్‌‌లో సేవలు పొందవచ్చన్నారు.