
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో రూ. 80 లక్షల నగదు చోరీ జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ మెయిన్ రోడ్ పక్కనే ఉన్న వైష్ణవి గ్రాండ్ హోటల్ నిర్వాహకులు శుక్రవారం రాత్రి ఆఫీస్ రూమ్ డోర్ లాక్ వేసి వెళ్లిపోయారు.
శనివారం (సెప్టెంబర్ 07) ఉదయం వచ్చి చూడగా ఆఫీస్ డోర్ లాక్ పగలగొట్టి ఉండడం, టేబుల్ డెస్క్ లు తెరిచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార నిమిత్తం ఆఫీస్ రూమ్లో దాచిన రూ.80 లక్షలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాజశేఖర రాజు, సీఐలు నాగభూషణ రావు, సోమ నర్సయ్య, పీఎన్ డీ ప్రసాద్, క్లూస్ టీమ్ సిబ్బంది వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.