
నల్గొండ అర్బన్, వెలుగు: రైతులు యాసంగిలో వరి పంట వేయొద్దని, వేస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానకాలం వడ్ల కొనుగోళ్లపై అగ్రికల్చర్, కో ఆపరేటివ్, మిల్లర్లతో మంగళవారం నల్గొండ కలెక్టరేట్‌లో మంత్రి రివ్యూ చేశారు. రైతులకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతోనే రాష్ట్ర సర్కార్ వడ్లు కొంటోందని చెప్పారు. యాసంగిలో వడ్ల కొనుగోలుపై కేంద్రం లిమిట్ పెట్టినందున రైతులు ఇతర పంటలు వేసేలా అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి, యాసంగిలో వరికి బదులు ఆయిల్‌పామ్, మినుములు, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పెసర వంటి పంటలు సాగుచేసేలా ఒప్పించాలన్నారు. భూమి రకాన్ని బట్టి పంటలు పండించేలా చూడాలన్నారు. వానాకాలం పంట కొనుగోలుపై రైతులకు టోకెన్లు జారీ చేసి క్రమబద్ధీకరణ చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్, అడిషనల్ కలెక్టర్ వి.చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్.భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.