- అరైవ్ అలైవ్ నినాదంతో పతంగులు ఎగిరేసిన మంత్రి జూపల్లి
నిర్మల్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆయన నిర్మల్లో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి పతంగులు ఎగరేశారు.
క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. హెల్మెట్ లేకుండా బైక్నడపవద్దన్నారు. ఫోర్ వీలర్స్ నడిపేవారు సీటుబెల్టు తప్పనిసరి చేసుకోవాలన్నారు. ఏఎస్పీ సాయికిరణ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఆదిలాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాద్యత అని ఆదిలాబాద్ జిల్లా జడ్జి ప్రభాకర్ రావు అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, ప్రమాదాలను నివారించి ప్రాణ నష్టాన్ని తగ్గించాలని సూచించారు.
రోడ్డు నియమాలకు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేసి వాటిని పాటించేలా ప్రోత్సహించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్తో ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రమాదం సంభవించినా ప్రాణనష్టాన్ని తక్కువ చేస్తుందన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి సీఎం రాజ్యలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఏఎస్పీ మౌనిక, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి
ఖానాపూర్, వెలుగు: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. ఖానాపూర్ పోలీసు శాఖ అధ్వర్యంలో పట్టణంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనర్లకు పేరెంట్స్ వాహనాలు ఇవ్వద్దన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దొనికేని దయానంద్, నిమ్మల రమేశ్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, సీఐ అజయ్ కు మార్, ఎస్ ఐ రాహుల్ గైక్వాడ్, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.
