
కలెక్టర్ కు ఫోన్ చేసిన మంత్రి జూపల్లి
ఆసిఫాబాద్, వెలుగు: వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్గా ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు సూచించారు. కలెక్టర్కు ఫోన్ చేసి అలర్ట్ చేశారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేయాలన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్, వెలుగు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండలని, ఆందోళన చెందవద్దని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇండ్లు నుంచి బయటకు రావద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్నవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. అత్యవసర సమయంలో ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 9100577132ను సంప్రదించాలని సూచించారు. వర్షాల కారణం గా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజే స్తామన్నారు. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.