
- సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తా
- దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు రిపేర్లు చేపట్టండి
- ఉమ్మడి జిలా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
- అధికారులతో రివ్యూ నిర్వహించి నష్టంపై ఆరా
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మజి జిల్లా పర్యటనలో భాగంగా వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై మంగళవారం ఆదిలాబాద్‌లోని పెన్ గంగా గెస్ట్ హౌజ్‌లో అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. వరద నష్టంపై శాఖల వారీగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, వంతెనలు, చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడ్డ చోట యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులను ఆదుకోవాలి
ఆదిలాబాద్ నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రికి విన్నవించారు. బోథ్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, బజార్ హత్నూర్ మండలంలోని దేగామ ప్రాజెక్టు నిర్వాసితులకు పక్కా ఇండ్లు మంజూరు చేయాలని, ఇచ్చోడ ఆశ్రమ స్కూల్లో వరద చేరి విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నాయని, కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. అనంతరం మంత్రి ఆదిలాబాద్ పట్టణంలో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.
11 మంది బాధిత కుటుంబాలకు
రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం, 10 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి, తంతోలి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మే 27న జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి వంతెన దాటే క్రమంలో వరదలో కొట్టుకుపోయి చనిపోయిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు కుటుంబానికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.5 లక్షల చెక్కను మృతుడి భార్య జ్యోతికి అందించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
భారీ వర్షాలపై అలర్ట్‌గా ఉండాలి
మంత్రి అంతకుముందు నిర్మల్‌జిల్లాలో పర్యటించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారంరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, నివాస గృహాలకు సంబంధించి సర్వే చేసి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలన్నారు.
దెబ్బతిన్న రోడ్లు, వంతెనకు రిపేర్లు చేయాలన్నారు. నీట మునిగిన వరి, మొక్క జొన్న, పత్తి, ఇతర పంటలను సర్వే చేసి నివేదికలను ప్రభుత్వానికి ఆదేశించారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టి డెంగ్యూ, మలేరియా, టైఫా యిడ్ వంటి వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందించాలన్నారు.
కడెం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
కడెం ప్రాజెక్టును మంత్రి జూపల్లి సందర్శించా రు. ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోకి వస్తున్న వరద ఉధృతి తో పాటు ఇన్ ఫ్లో వివరాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదలో కొట్టుకుపోయిన మత్స్యకారుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాలని ఆదేశించారు.
ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. వాగులు, నదులు, ప్రాజెక్టు ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ దండె విట్టల్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్ కలెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు భూషణ్, అబ్దుల్ మాజిద్ పాల్గొన్నారు.