
- పాలమూరు రివ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్కర్నూల్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సోమవారం బీఆర్ అంబేద్కర్సెక్రటేరియట్లో నీటిపారుదల శాఖ, ఆర్ అండ్ఆర్ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.
నార్లాపూర్ నిర్వాసితులకు కొల్లాపూర్ మండలం ఎల్లూర్ శివారులోని టన్నెల్ సమీపంలో ప్రతిపాదించి ప్రాంతంలో కాకుండా ఎత్తయిన ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి సూచించారు. తమకు టన్నెల్ పక్కన కాకుండా వేరే ప్రదేశంలో స్థలాలు కేటాయించాలని బోడబండా తండా గ్రామపంచాయతీ పరిధిలోని సున్నపు తండా, దూల్యానాయక్ తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితులు మంత్రికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
నిర్వాసితుల అభ్యర్థన మేరకు వారు కోరుకుంటున్నట్లుగా మెరుగైన ప్రదేశంలో ఇండ్ల స్థలాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ, అటవీ శాఖ భూముల్లో ఉన్న ఎల్లూర్, నార్లాపూర్ గ్రామాల నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ.. వారికి పరిహారం చెల్లించలేదు. దీంతో పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎల్లూరు నుంచి బోడబండ తండా, అక్కడి నుంచి మొలచింతల పల్లి రోడ్డు అధ్వాన్నంగా ఉందన్న మంత్రి వెంటనే రిపేర్లు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఆర్ ఆండ్ ఆర్ కమిషనర్ వినయ కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.