నల్గొండ అర్బన్, వెలుగు: నేటి నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద- 37, 39, 40,41 డిస్ట్రిబ్యూటరీలోని అన్ని చెరువులకు నీటిని విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రూ.10 కోట్లతో నల్గొండ జిల్లా తిప్పర్తి మండల చౌరస్తా అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిప్పర్తి చౌరస్తా డెవలప్మెంట్ పనులను దసరా లోపు కంప్లీట్ చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. సాగర్ నుంచి వచ్చిన నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో భాగంగా ముందుగా చెరువులు నింపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారుల ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటరీల ద్వారా జాగ్రత్తగా నీటిని కిందికి వదలడం, చెరువులను నింపడం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక చొరవ తీసుకుని చెరువులన్నింటిని నింపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. కార్యక్రమంలో ఎంపీ రఘువీర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మిర్యాలగూడ, నాగార్జుసాగర్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్, నల్గొండ ఆర్డీవో రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామిరెడ్డి పాల్గొన్నారు.
