
- టిమ్స్, రోడ్ల మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
- పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులు వేగంగా జరిగేందుకు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడానని, బిల్స్ విడుదల చేసేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రోడ్ల మరమ్మతులతో పాటు టిమ్స్ హాస్పిటల్స్ పనులు సైతం వేగంగా జరగాలని సూచించారు. వీటిని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చెప్పారు. వర్షాలు ప్రారంభమైనందున జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో అర్ అండ్ బీ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లు సరిగా లేని చోట ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలన్నారు.
మంగళవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ఆఫీసులో ఈఎన్సీ జయభారతి, సీఈలు రాజేశ్వర్ రెడ్డి, మోహన్ నాయక్, లక్ష్మణ్, లింగారెడ్డి తదితర అధికారులతో మంత్రి వెంకట్‌రెడ్డి రోడ్లపై రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి సీఆర్‌ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) కింద రాష్ట్ర వాటా రూ.300 కోట్ల వచ్చేలా కృషి చేశానన్నారు. శాఖలో ఎన్నడూ లేని విధంగా సీఎంతో మాట్లాడి పెద్ద ఎత్తున ఇంజనీర్లకు ఇటీవల ప్రమోషన్లు ఇచ్చామని, మంచి పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
మంత్రికి ఉద్యోగుల కృతజ్ఞతలు..
హ్యామ్ రోడ్ల పనుల ప్రారంభంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఈఎన్సీని మంత్రి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. తెల్లాపూర్, అమీన్ పూర్, సంగారెడ్డి, మంచాల, చౌటుప్పల్, చిట్యాల, భువనగిరి, హలియ మల్లేపల్లి రోడ్లపై చర్చించారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఆర్ అండ్ బీ రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు భూ సేకరణ సమస్య లేకుండా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కొత్త కలెక్టరేట్లు, ఆర్వోబీల నిర్మాణం వేగంగా జరగాలని ఆదేశించారు.
ఆర్ అండ్ బీలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంజనీర్ల ప్రమోషన్లను పూర్తి చేసినందుకు మంత్రికి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల ప్రసాద్, సెక్రటరీ సురేశ్, నేతలు సుజాత, రాజేశ్వరీ కృతజ్ఞతలు తెలిపారు. ఏఈఈ నుంచి డీఈఈలుగా 118 మంది, డీఈఈ నుంచి ఈఈలుగా 72 మంది, ఈఈ నుంచి ఎస్‌ఈలుగా 29 మందికి ప్రమోషన్లు ఇవ్వడంపై సీఎం రేవంత్‌కు, మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రమోషన్లు పొందిన ఇంజనీర్లకు పోస్టింగ్ ఆర్డర్లను మంత్రి అందజేశారు.