నల్గొండలో మంత్రి ప్రజాదర్బార్​ 

నల్గొండలో మంత్రి ప్రజాదర్బార్​ 
  • స్టేట్​లో తొలిసారిగా కలెక్టర్​తో కలిసి వినూత్న కార్యక్రమం  
  • ఇక నుంచి ప్రతి సోమవారం అమలు
  • క్యాంపు ఆఫీసు కేంద్రంగా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరణ 
  • ఉమ్మడి జిల్లా నుంచి క్యూకడుతున్న బాధితులు 

నల్గొండ, వెలుగు : రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నల్గొండలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కలెక్టరేట్లు, మండల పరిషత్​ఆఫీసుల్లో జరిగే ప్రజావాణి తరహాలో రాష్ట్రంలో తొలిసారిగా మంత్రి కోమటిరెడ్డి నల్గొండలో  ప్రజాదర్బార్​ప్రారంభించారు. ప్రతి సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల నుంచి మంత్రి స్వయంగా ఆర్జీలు తీసుకుంటున్నారు. సోమవారం కలెక్టర్​సి.నారాయణరెడ్డితో కలిసి మినిస్టర్​క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్​నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి 'వెలుగు'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. 

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే..

ఇక నుంచి ప్రజాదర్బార్​పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించాం. వచ్చే సోమవారం నుంచి నాతోపాటు సంబంధిత అధికారులు కూడా ప్రజాదర్బార్​లో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. వాళ్ల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. చదువుకునేందుకు డబ్బులు లేనివాళ్లు, క్యాన్సర్​పేషెంట్లు, ఉద్యోగులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు ఎక్కువగా వస్తున్నారు. 

ప్రతిఒక్కరినీ ఆదుకుంటా..

ప్రజా జీవనంలో ఎదురయ్యే చిన్నా, చితక సమస్యలను పరిష్కరించి.. ప్రతిఒక్కరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టా. ప్రభుత్వ నిధులతోపాటు నా కొడుకు ప్రతీక్​ఫౌండేషన్​పేరుతో వీలైనంత మేరకు ఆర్థిక సాయం చేస్తున్నాం. అవసరమైన చోట బాలికలకు సైకిళ్లు, కంప్యూటర్లు, ఆసత్రుల్లో ఏసీలు మంజూరు చేయిస్తున్నా. క్యాన్సర్​పేషెంట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నా. 

సమస్యలకు సత్వర పరిష్కారం..

సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తున్నా. కాలేజీ హాస్టల్స్​లో సీట్లు, ఫీజులు, రెవెన్యూ, పోలీస్ మ్యాటర్స్​ ఏమైనా ఉంటే బాధితుల సమక్షంలోనే నేరుగా అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నేను అందుబాటులో లేకుంటే క్యాంపు ఆఫీసులో మా స్టాఫ్​ఉంటరు. ఎ ల్లవేళల క్యాంపు ఆఫీసు తెరిచే ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం అవసరమైతే రెండు రోజులు కూడా ప్రజాదర్బార్​ కంటిన్యూగా కొనసాగిస్తాం.