
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా కొందరు కోర్టుకు వెళ్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని.. దయచేసి బీసీలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులో వేయొద్దని కోరారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. తెలంగాణ ప్రజలకు మేలు చేసే నిర్ణయమన్నారు.
దేశానికి దిక్సూచిగా నిలిచే సాహసోపేత నిర్ణయానికి పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రిజర్వేషన్ల జీవోకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. శనివారం (సెప్టెంబర్ 27) నల్గొండ జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు అజరామమని కొనియాడారు.
మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు ఏ పదవీ చేపట్టనని చెప్పి ఆచరించిన గొప్ప నేత అని పొగిడారు. ఆయన మాటలు, చేతలు నేటి తరం నేతలకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కొండా లక్ష్మణ్ బాపుజీ స్ఫూర్తితోనే తెలంగాణ కోసం నేను మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరహార దీక్ష చేశానని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపుజీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని.. పేదవారి ప్రగతి కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నదన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి దేశ ప్రజలకు ఏమి కావాలో తెలుసుకున్నారని.. జనాభాలో ఎవరెంతో వారికంతా అనే నినాదాన్ని గట్టిగా ఆయన వినిపిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9 విడుదల చేసిందని తెలిపారు.
ఇందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, నా సహచర మంత్రులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని.. కానీ మేం మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇచ్చామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.