డూప్లికేట్​ రిజైన్​ లెటర్​తో హరీశ్ ​డ్రామాలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

డూప్లికేట్​ రిజైన్​ లెటర్​తో హరీశ్ ​డ్రామాలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ఆయనో జోకర్​.. అధికారం పోయి మతిభ్రమించింది
  • ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ క్లోజ్​
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్  నేత హరీశ్​రావు ఓ జోకర్ గా మారారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ‘‘పంద్రాగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ ఒక్క హామీ కాదు మొత్తం హామీలు నెరవేర్చాలని, లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని సవాల్ చేస్తూ హరీశ్​ ఓ డూప్లికేట్​ రాజీనామా లెటర్ తో అమరవీరుల స్థూపం దగ్గర  డ్రామాలు మొదలుపెట్టిండు” అని ఆయన మండిపడ్డారు.

‘‘అధికారం పోయిన తర్వాత హరీశ్​రావుకు మతిభ్రమించింది. అందుకే ఆయనను హవ్లేశ్​రావు అంటున్నం.. అన్నీ హౌలా పనులు చేస్తున్నడు” అని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన ఇంట్లో మంత్రి వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ‘‘ఆనాడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని ఎలాగైతే డ్రామాలాడి వందలమంది అమాయకపు బిడ్డలను పొట్టన పెట్టుకున్నడో.. ఇప్పుడూ మళ్లీ అదే డ్రామా స్టార్ట్ చేసిండు” అని హరీశ్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే.. స్పీకర్ ఫార్మాట్ లో ఒకే లైన్​లో చేస్తారని, కానీ హరీశ్​రావు మాత్రం పేజిన్నర లెటర్ రాసి రాజీనామా చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ‘‘నాడు ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ హరీశ్​రావు.. ఇప్పుడు మేం ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నడు. హరీశ్​, ఆయన మామ కేసీఆర్ చేసిన లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెలా రూ. 26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నం” అని తెలిపారు. 

అధ్యక్షుడి లెక్క ఊహించుకుంటున్నడు

బీఆర్​ఎస్​ పాలనలో చేసిన మోసాలు తెలంగాణ ప్రజల పాలిట శాపాలుగా మారాయని, ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణం కేసిఆర్ చేసిన అప్పులేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ‘‘బీఆర్ఎస్ పార్టీలో హరీశ్​రావు ఒక సర్వెంట్ మాత్రమే. వాళ్ల ఓనరు ఏం చెప్తే అది ఆయన చేయాల్సిందే. అలాంటి వ్యక్తి మామ(కేసీఆర్​) తర్వాత తానే పార్టీ లీడర్, అధ్యక్షుడు అన్నట్టుగా ఊహించుకొని ఏదేదో చేస్తున్నడు. 

ఆనాటి అగ్గిపెట్టె మోసానికి, ఈనాటి రాజీనామా నాటకానికి ఏమాత్రం తేడా లేదు” అని విమర్శించారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉండి 100 రోజులు కూడా సెక్రటేరియెట్ కు రాని మీ మామను ఎందుకు రావడం లేదని అప్పుడే రాజీనామా ఇయ్యాల్సింది” అని హరీశ్​కు సూచించారు. ‘‘హరీశ్​రావు..! మీ మామ(కేసీఆర్​) దళితున్ని సీఎం చేస్తానని మాటతప్పినప్పుడు.. దళితులకు మూడెకరాల భూమి ఇయ్యనందుకు..ప్రతి ఎకరాకు ఉచిత యూరియా అని చెప్పి ముంచినందుకు, నిరుద్యోగుల ఉసురుపోసుకున్నప్పుడు, ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వనప్పుడు రాజీనామా లేఖను పట్టుకొని అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తే బావుండేది” అని అన్నారు.