‘వరంగల్’ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదాం : మంత్రి కొండా సురేఖ

 ‘వరంగల్’ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదాం : మంత్రి కొండా సురేఖ
  • అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్ (రంగశాయిపేట)/ కాశీబుగ్గ, వెలుగు: మానవాళికి ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కాలేజ్​ ఆవరణలో వనమహోత్సవంలో నగర మేయర్ గుండు సంధ్యారాణి, కలెక్టర్ సత్య శారద, డీఎఫ్వో అనుజ్ అగర్వాల్, ఏసీపీ శుభం, అడిషనల్​ కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పోశాల పద్మతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం వరంగల్​ ఎల్భీనగర్​లో బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. 

తూర్పు నియోజకవర్గంలోని 100 మహిళా సంఘాలకు మంజూరైన రూ.2.41 కోట్ల వడ్డీలేని రుణాలు, 98 మహిళా సంఘాలకు మంజూరైన రూ.12.46 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులు, 2690 లబ్ధిదారులకు కొత్త రేషన్​కార్డులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలనే ఆశయంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.