
హైదరాబాద్: చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని అనేకమార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కారణంగా ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని మండలిలో కేటీఆర్ చెప్పారు. కరోనా నష్టాల నుంచి పరిశ్రమలను కాపాడుకుందామని గొప్పలు చెప్పిన కేంద్రం.. అందుకు ఏమీ చేయడం లేదని మండిపడ్డారు.
‘దేశంలోని పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను కాపాడుకోవడానికి రూ. 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అయితే దీని కోసం ప్రతిరోజూ వెతుకున్నా. కానీ వాటి ఆచూకీ ఇప్పటి వరకు నాకు దొరకలేదు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. కేంద్రానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేశాం. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేశారు. కానీ ఎంఎస్‌ఎంఈలకు ఏమీ చేయలేదు. కేంద్రం చెప్పిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ పెద్ద మిథ్య’ అని కేటీఆర్ విమర్శించారు.
అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం
‘కళాకారులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. కళాకారుల్లోని కళను గుర్తించి ప్రోత్సాహం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కళాకారులను అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మండలాలు, జిల్లాల్లోని వృద్ధ కళాకారులను గుర్తించి పెన్షన్ పెన్షన్ ఇప్పిస్తాం’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.