ప్రతిపక్షాలు సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులు: మంత్రి కేటీఆర్​

ప్రతిపక్షాలు  సంక్రాంతికి వచ్చే  గంగిరెద్దులు:  మంత్రి కేటీఆర్​

దుండిగల్, వెలుగు: సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లా ప్రతిపక్ష నేతలు ఎన్నికల సమయంలో వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని మంత్రి కేటీఆర్​ అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదల కుటుంబాలకు సీఎం కేసీఆర్​ మేనమామలాగా ఇండ్లు ఇస్తూ, ఆడబిడ్డలకు పెండ్లి చేయిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 60 వేల కోట్ల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లను  పేదలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరుపుతున్నామని,  ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పారు. బుధవారం మేడ్చల్ జిల్లా దుండిగల్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 

లబ్ధిదారులకు కేటీఆర్​ పట్టాలను అందజేశారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. త్వరలో దుండిగల్​కు భారీ పరిశ్రమను తీసుకురాబోతున్నామని చెప్పారు. పేదలను ప్రేమించే విషయంలో కేసీఆర్ ను మించిన నాయకుడు దేశంలో లేరని, ఇక్కడ ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూం ఇండ్లు  దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని  ప్రశ్నించారు. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి  కేసీఆర్ అందించిన బహుమతి కేటీఆర్ అని కొనియాడారు.