ఐటీసీ ఫుడ్ తయారీ పరిశ్రమ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఐటీసీ ఫుడ్ తయారీ  పరిశ్రమ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఐటీసీ ఫుడ్ తయారీ పరిశ్రమ రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. మనోహరాబాద్ లోని ఐటీసీ ఫుడ్ తయారీ పరిశ్రమను ప్రారంభించారు. స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించేలా ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీ కోసం భూములు కోల్పోయిన వారిని ఆదుకునే బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కంపెనీ తయారు చేసే చిప్స్, బిస్కెట్స్ కోసం ఆలుగడ్డలు, గోధుమలు ఇక్కడే కొనాలని ఐటీసీ ఛైర్మన్ కు విన్నవించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తక్కువ సమయంలో పూర్తి చేసిన ఘనత రాష్ట్ర సర్కారు సొంతమని అన్నారు. 

మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను బాగు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ హబ్ కోసం స్పెషల్ సెజ్ ను ఏర్పాటు చేస్తున్నామని, 68 లక్షల నుంచి 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదిగామని అన్నారు. కోళ్ల పరిశ్రమకు, దాణాకు తెలంగాణ కేంద్రంగా మారిందని చెప్పారు. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలు అభివృద్ధి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.