
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కామర్స్పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ మీటింగ్తో పాటు తెలంగాణ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో రేపటి పర్యటనను మంత్రి రద్దు చేసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో కేటీఆర్ ఖమ్మం పర్యటనకు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడటానికి బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య అనంతరం పరిస్థితులు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల వేధింపుల కారణంగానే సాయి గణేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఖమ్మంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టూర్ వాయిదా వేసుకోవడమే మంచిదన్న ఇంటలిజెన్స్ సూచన మేరకు కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దైనట్లు సమాచారం.