కాంగ్రెస్ బస్సుయాత్ర... తుస్సుమనడం ఖాయం : కేటీఆర్

కాంగ్రెస్ బస్సుయాత్ర... తుస్సుమనడం ఖాయం : కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా సోషల్​ మీడియా వేదికగా టఫ్  ఫైట్ నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై మరోసారి మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.  కాంగ్రెస్ బస్సుయాత్ర... తుస్సుమనడం ఖాయమన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అయితే...చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అంటూ ట్విట్టర్​ లో విమర్శించారు. 

గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదన్నారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. 

తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణమని ఆరోపించారు. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని ఆరోపించారు. 

Also Read :- సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇస్తాం 

మరోవైపు.. రేవంత్​ పైనా తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్​. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్​అని ఆరోపించారు. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు... రేవంత్​ అని ఆరోపించారు. 

మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా...తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని చెప్పారు. వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరని తెలిపారు.